రష్యా సైన్యం వద్ద సహాయకులుగా పనిచేస్తోన్న భారతీయులకు విముక్తి లభించనుంది. రెండు రోజుల పర్యటనకు రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భారతీయులకు విముక్తి లభించింది. నిన్న రష్యాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి, అధ్యక్షుడు పుతిన్ ఘన స్వాగతం పలికారు. రాత్రివేళ విందు సమయంలో రష్యా సైన్యం వద్ద ఇరుక్కుపోయిన భారతీయుల విషయం చర్చించినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని సురక్షితంగా భారత్ పంపించేందుకు పుతిన్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉద్యోగావకాశాలంటూ ఏజంట్ల ప్రకటనలు నమ్మి దేశంలోని పలు రాష్టాలకు చెందిన 40 మంది వరకు యువత రష్యా చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక రష్యా సైనికులకు సహాయకులుగా పనిచేయాలని ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో వారు ఇరుక్కుపోయారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నలుగురు భారతీయులు చనిపోయారనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ చొరవ చూపారు. రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను వెంటనే విడుదల చేయించేందుకు పుతిన్‌తో జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిని ప్రత్యేక విమానంలో భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ సమాచారం.