అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వారాలుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. 28 జిల్లాల్లో 27 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కజరంగా జాతీయ పార్కులో 137 జంతువులు వరద భారినపడి చనిపోయాయని అధికారులు తెలిపారు. చనిపోయిన జంతువుల్లో 6 ఖడ్గమృగాలు కూడా ఉన్నట్లు కజరంగా పార్క్ డైరెక్టర్ సొనాలి ఘోష్ వెల్లడించారు. 235 జంతువుల శిబిరాల్లో, 70 శిబిరాలు నీట మునిగాయన్నారు. 99 జంతువులను వరదల నుంచి రక్షించినట్లు వారు తెలిపారు.
అస్సాంలోని గోల్పోరా, నాగాన్, కామ్రూప్, మరిగోన, దిబ్రుగర్, సోనిపూర్, సౌత్ సల్మారా, దుబ్రి, జోర్హాట్, హోజ, కరీంగంజ్, శివసాగర్, బార్పేట్, దేమాజీ, గోలాఘాట్ జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం వందలాది శిబిరాలను ఏర్పాటు చేసింది. వరదల నుంచి రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు.