ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా చర్రా పోలీస్ స్టేషన్‌లో జులై 7న ఒక ఫిర్యాదు వచ్చింది. సైవాన్ మియా అనే వ్యక్తి తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడంటూ అతని భార్య ఫిర్యాదు చేసింది. అతనామెకు తలాక్ ఇవ్వడానికి కారణం, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ మహిళ బీజేపీ అభ్యర్ధికి ఓటు వేయడమే.
ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల మేరకు… బాధిత మహిళకు, సైవాన్ మియాతో 2021 ఏప్రిల్‌లో పెళ్ళయింది. పెళ్ళిలో అతనికి 8.5లక్షల కట్నం కూడా ఇచ్చారు. ఆ తర్వాత, అతనికి అంతకుముందే పెళ్ళై సంతానం ఉన్న సంగతి తెలిసింది. సైవాన్, అతని తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని దాచిపెట్టారు. కొంతకాలానికి ఆ మొదటి పెళ్ళి విషయం తెలిసి దానిగురించి అడిగితే పొంతన లేకుండా మాట్లాడడమే కాక తనను భౌతికంగా కొట్టేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత సైవాన్, అతని కుటుంబం బాధితురాలిని అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. కట్నం తీసుకురాకపోతే విడాకులు ఇచ్చేస్తామని బెదిరించారు. ఆమెను భౌతికంగానూ హింసించారు.
24 ఏప్రిల్ 2024న బాధితురాలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసింది. పోలింగ్‌బూత్ నుంచి ఇంటికి వెడుతుండగా సైవాన్, అతని సోదరులు షబ్బూ, షాదాన్ ఎదురయ్యారు. ఎవరికి ఓటువేసావని ఆమెను అడిగారు. తాను బీజేపీ అభ్యర్ధికి ఓటు వేసానని ఆమె చెప్పింది. అప్పుడు, ఆమెకు విడాకులిచ్చేయమంటూ సైవాన్‌ను అతని సోదరులు రెచ్చగొట్టారు. దాంతో నిందితుడు మూడుసార్లు తలాక్ చెప్పాడు. తమ సంబంధం ఇక ముగిసిపోయిందని తేల్చిచెప్పేసాడు.
బాధిత యువతి పెళ్ళికి ముందు స్థానిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయాక నిందితుడు ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాతే, ముస్లిం మహిళల స్థితిగతులు మెరుగు పడడం గురించి, సమాజం బాగు గురించి పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అని ఆమె గ్రహించింది. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి ఓటు వేసింది.
చర్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలేంద్ర సింగ్, ఈ మేరకు ఫిర్యాదు వచ్చిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసామనీ ధ్రువీకరించారు. నిందితులు సైవాన్ మియా, ఖుర్షీద్, షబ్బూ, షాదాన్, ఖుర్గాన్‌లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. గృహహింస, వరకట్నం, ముస్లిం మహిళల రక్షణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.