సందేశ్‌ఖాలీ హింసాకాండ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలను తిరస్కరించింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల భూఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం, కలకత్తా హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం పెట్టుకున్న అప్పీలును కొట్టిపడేసింది. షాజహాన్ షేక్, అతని అనుచరులు గిరిజనుల భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారని, అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న విషయాలు వెలుగుచూడడంతో కలకత్తా హైకోర్టు ఆ కేసును సుమోటోగా తీసుకుని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.
బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణకు రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఆయన వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా విచారణలు జరిపిందని, కమిషన్లు ఏర్పాటు చేసిందనీ చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల మీద దాడి అనే ఒక ఘటన నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయనీ, వాటన్నిటిపైనా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించిందనీ సింఘ్వీ చెప్పారు. నిజానికి వాటిని ప్రత్యేకంగా విచారించాలని ఆయన వాదించారు.
ఆ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. సందేశ్‌ఖాలీ సంఘటనలకు సంబంధించిన అన్ని కేసులూ సిబిఐ దర్యాప్తు పరిధిలోకి వస్తాయని తేల్చిచెప్పింది. ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వం జాప్యం చేయడాన్ని జస్టిస్ గవాయ్ తప్పుపట్టారు. నెలల తరబడి ఏ చర్యా తీసుకోకుండా కూర్చున్నారని మండిపడ్డారు. జస్టిస్ విశ్వనాథన్ కూడా అదేవిధంగా అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్ళక్రితం నమోదైన కేసులను సైతం బెంగాల్ పోలీసులు పరిష్కరించడం లేదన్నారు.
పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఏళ్ళ తరబడి అరాచకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారే లేకపోయారు. కొన్నినెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కుంభకోణం విచారణకు ఆ ప్రాంతానికి వెడుతున్న ఈడీ అధికారులపైనే షాజహాన్ షేక్ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. దాంతో సందేశ్‌ఖాలీ వార్తల్లోకెక్కింది. ఆ నేపథ్యంలోనే షాజహాన్ షేక్, అతని అనుచరులు తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో మహిళలను నిర్బంధించి నెలల తరబడి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.