ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన సంతానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో ఆయన సమాధి దగ్గర అన్నాచెల్లెళ్ళిద్దరూ వేర్వేరుగా నివాళి కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ భార్య విజయమ్మ రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ ఈ ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ వెంట ఉన్నారు. ఆ సందర్భంగా విజయమ్మ తన కుమారుణ్ణి కౌగిలించుకుని కంటతడి పెట్టారు. వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయాక తల్లీకొడుకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి.
జగన్ అక్కడినుంచి వెళ్ళిపోయిన అరగంట తర్వాత వైఎస్ కుమార్తె షర్మిల అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన తండ్రికి నివాళులర్పించారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్, కొడుకు, కోడలు, కూతురు ఉన్నారు. తల్లి విజయమ్మ తన కూతురు నిర్వహించిన నివాళి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ పార్టీలు ఘనంగా చేస్తున్నాయి. ఆయన వారసత్వం తమదే అని చాటుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, వైఎస్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయిలో భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సిపి కూడా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతి కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజును రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది.