ఫ్రాన్స్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆశ్చర్యకర ఫలితాలను ప్రకటించాయి. ముందు అంచనా వేసినట్లు జాతీయవాద పార్టీ నేషనల్ ర్యాలీ కాకుండా, వామపక్ష అతివాద కూటమి ఆధిక్యం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తాజా అంచనాలు చెబుతున్నాయి. ఆ నేపథ్యంలో ఫ్రాన్స్ దేశమంతటా హింసాకాండ చెలరేగింది.
ఫ్రెంచి పార్లమెంటులో వామపక్ష కూటమికి మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తుండడంతో ప్యారిస్‌లో ఒకవైపు వేడుకలు, మరోవైపు అశాంతి నెలకొన్నాయి. మాస్కులు ధరించిన ప్రదర్శనకారులు వీధుల్లో పరుగులు తీసారు. కాగడాలు వెలిగించి రోడ్ల మీద విసిరేసారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు చెలరేగాయి. వారిని అదుపు చేయడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. వామపక్ష కూటమి ఆధిక్యం గురించిన వార్తలు రాగానే ప్రధానమంత్రి గాబ్రియెల్ అట్టల్ రాజీనామా చేసారు.
పారిస్ ప్రధాన కూడళ్ళలో వేలాదిమంది వామపక్ష మద్దతుదారులు గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. పారిస్ సహా పలు నగరాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. ఆ కారణంగా ఘర్షణలు జరగడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
సోషలిస్ట్ పార్టీ, ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఎకలాజిస్ట్స్, ఫ్రాన్స్ అన్‌బౌడ్ అనే నాలుగు వామపక్ష రాజకీయ పార్టీలు కలిసి పాపులర్ ఫ్రంట్ (NFP) పేరుతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసాయి. ఆ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ పార్టీ మొదటినుంచీ మూడోస్థానంలోనే నిలిచింది. మొదటి దశ ఎన్నికల్లో జాతీయవాద నేషనల్ ర్యాలీ ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో దశ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.
అధికారికంగా తుది ఫలితాలను ఇవాళ ప్రకటించే అవకాశముంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు