పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి, ప్రస్తుతం సింధ్‌లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అలీ రజాను కొందరు సాయుధులు కాల్చిచంపారు. ఆ హత్య ఆదివారం కరాచీ నగరంలో జరిగింది. హంతకులు ఎవరో ఇంకా తెలియరాలేదు.
అలీరజా హత్యకు దారితీసిన కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు. రజా హంతకులను పట్టుకోడానికి పాక్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
భారతదేశంలోని గురుదాస్‌పూర్‌లో 2015లో జరిగిన ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన సూత్రధారుల్లో అలీరజా ఒకడు. ఆనాటి దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది సహా ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రదాడి ఘటన భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను, పాకిస్తాన్ నుంచి భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ళనూ ప్రపంచం ముందు పెట్టింది.
2015 జులై 27 తెల్లవారుజామున 5.30 సమయంలో ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలు ధరించి పంజాబ్ గురుదాస్‌పూర్ నగరంలో దినానగర్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. వారు మొదట ఒక మారుతీ కారును హైజాక్ చేసి, దాని యజమాని కమల్జిత్ సింగ్‌ను హత్య చేసారు. ఆ కారులో దినానగర్ బస్టాండ్‌కు చేరుకుని ఒక బస్సును లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
అక్కడినుంచి ఉగ్రవాదులు దినానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. అక్కడ గార్డు డ్యూటీలో ఉన్న సెంట్రీలపై దాడి చేసారు. ఆ కాల్పుల్లో రాజీందర్ కుమార్, అశోక్ కుమార్ అనే ఇద్దరు హోంగార్డులు, ఎస్ఐ ముక్తియార్ సింగ్ గాయపడ్డారు. అయితే వారిని పోలీస్ స్టేషన్లోకి రానీయకుండా హెడ్‌కానిస్టేబుల్ రాంలాల్ అడ్డుకోగలిగాడు. ఉగ్రవాదుల విచక్షణారహిత కాల్పుల్లో పోలీస్ స్టేషన్ చేరువలో ఉన్న కిరణ్ హాస్పిటల్‌లోని ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ వెనుకనే ఉన్న పంజాబ్ హోంగార్డ్స్ కార్యాలయంపై దాడి చేసారు. వారి కాల్పుల్లో ముగ్గురు హోంగార్డ్ అధికారులు చనిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు ఉగ్రవాదులు ముగ్గురినీ మట్టుపెట్టగలిగారు. ఆ క్రమంలో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పి బల్జీత్ సింగ్ అమరులయ్యారు.
పాకిస్తానీ టెర్రరిస్టుల నుంచి పంజాబ్ పోలీసులు 3 ఎకె47 రైఫిల్స్, 19 మ్యాగజైన్లు, 2 జిపిఎస్ పరికరాలూ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదులే తల్వండీ గ్రామం దగ్గర రైల్వేట్రాక్ మీద 5ఐఈడీ బాంబులు అమర్చినట్లు కనుగొన్నారు. ఆ బాంబులను సకాలంలో నిర్వీర్యం చేయగలగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆనాటి ఉగ్రదాడిలో ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు, ముగ్గురు హోంగార్డులు, ఒక పోలీస్ అధికారి తుదిశ్వాస విడిచారు. మరో పది మంది సాధారణ పౌరులు, ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
భారతదేశపు అంతర్గత భద్రతను సవాల్ చేసిన ఆ ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన పాకిస్తానీ ఐఎస్ఐ అధికారిని నిన్న ఆదివారం అతని స్వదేశంలోనే గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.