దొంగలు చెలరేగిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.30 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ముసుగులు వేసుకున్న ముగ్గురు దొంగలు ఏటీఎంలో ప్రవేశించి సీసీ కెమెరాలను పక్కకు తిప్పి, గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను కట్ చేశారని పోలీసులు తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాలో దొంగల వీడియో రికార్డైంది. కేవలం 15 నిమిషాల్లోనే పనికానిచ్చేశారని గుర్తించారు.
ఇటీవల ఏటీఎం దొంగలు చెలరేగిపోతున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలుముద్రలను సేకరించారు. అనుమానిత ముఠాల వేలి ముద్రలతో సరిపోల్చుకుని దొంగలను గుర్తించే పని చేపట్టారు. గతంలో గుడిపాల ఎస్‌బిఐ ఏటీఎం చోరీ యత్నం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బ్యాంకులు ఏటీఎంల వద్ద భద్రత కట్టుదిట్టం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.