ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాధుని రథయాత్ర మొదలైంది. దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి లక్షలాది భక్తులు రథయాత్ర వీక్షించేందుకు తరలివచ్చారు. పూరీ పుర వీధులు భక్తులతో కిక్కిరిపోయాయి. జైబోలో జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ నగర వీధులు మార్మోగుతున్నాయి.
రథయాత్రలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువుదీరారు. జగన్నాథున్ని నవయవ్వన రూపాలంకరణ చేశారు. మంగళహారతులు, తిలకధారణ, గోపాలవల్లభ, మైలం సేవలు నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు అశ్వాలు, సారథులు రథాలకు తాళ్లు కట్టారు. 5 గంటలకు బలభద్రుని తాళధ్వజ రథం లాగడం ప్రారంభించారు. దేవీ సుభద్ర దర్ఫదళన్, పురుషోత్తముడి నందిఘోష్ రథాలు తల్లి ఒడికి బయలుదేరాయి.
రథయాత్ర విజయవంతం చేసేందుకు ఒడిషా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేశారు. 3 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల యూపీలోని హథ్రాస్‌లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఒడిషా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.