తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. దీనినే అభిధేయక అభిషేకం అంటారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులకు ఏడాదికోమారు స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమరుస్తారు.
జూలై 16న కవచాధివాసం, జూలై 17న కవచ ప్రతిష్ఠ, జూలై 18న కవచ సమర్పణ నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.
కపిలేశ్వరంలో పవిత్రోత్సవాలు ….
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18 నుంచి 20వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈక్రతువులో భాగంగా జూలై 17న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఉండేందుకు శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. దీంతో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.