హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. వాయిద్యాలతో పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. నేటి నుంచి ఆషాఢమాసం ముగిసే వరకు గురు, ఆదివారాల్లో బోనాలను సమర్పించనున్నారు.
నేడు తొలిపూజ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాల పండగలు జరగనున్నాయి.
వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శనివారం నుంచి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 21 వరకూ ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. అమ్మవారిని శాకంబరిగానూ.. శతాక్షి, దుర్గ అనే పేర్లతో కూడా కొలుస్తారకు. అలాగే మహాదేవిగా కీర్తించబడే ఈ అమ్మవారిని పోషణ దేవతగా పరిగణిస్తూ ఉంటారు. శాకంబరీ దేవి జీవుల దు:ఖాలను దూరం చేసి, దుష్టులను శిక్షిస్తుందని నమ్మకం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద శనివారం నాడు కలశస్ధాపన, జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద పూజలు నిర్వహించడంతో వారాహి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఆషాఢం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.