భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరాచకం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్ల వేధింపులు తట్టుకోలేక కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ గత నెల 30న ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం శ్రీరాములు శ్రీనివాస్ మృతి చెందారు.ఎస్సై గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలింది.
ఎస్సై శ్రీనివాస్ మృతికి ఆశ్వారావుపేట స్టేషన్లో పనిచేస్తోన్న కానిస్టేబుళ్లే కారణమని ఫిర్యాదు అందింది. దీంతో ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లు సుభానీ, సన్యాసినాయుడు, శేఖర్, శివనాగరాజులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఓ రిపోర్టర్ సాయంతో తప్పుడు కథనాలు పత్రికల్లో రాయించి నిత్యం వేధిస్తున్నారని ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ మరణం వాగ్మూలంలో చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీ అశ్వారావుపేట సీఐపై కూడా కేసు నమోదు చేశారు. కానిస్టేబుళ్లను ఎస్పీ ఆఫీసులో వీఆర్‌కు పంపారు.