రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, అంచనాలు నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో వానలు పడతాయని వెల్లడించింది. వరుసగా ఏర్పడే ఆవర్తనాలు, అల్పపీడనాలతో ఈ నెల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడే అవకాశముంది. ప్రస్తుతం ఖరీఫ్ మొదలైనందున, వ్యవసాయ రంగానికి మేలు జరిగే అవకాశముంది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించింది. ఈ ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశముంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు(ఆది), సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అది ఏపీ వైపుగా వస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు బంగాళాఖాతంలో 23న ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.