బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయంలో నేటి నుంచీ ఆషాఢమాస వేడుకలు మొదలయ్యాయి. కనకదుర్గమ్మను తమఇంటి ఆడబడుచుగా భావించి, భక్తులు ప్రతీయేటా ఆషాఢమాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతో సారె తీసుకుని ఈ మాసమంతా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారు. ఇవాళ ఆషాఢమాసం మొదటిరోజు ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాములు మొదటిసారె సమర్పిస్తారు.
ఈ యేడాది మొదటిసారి ఇంద్రకీలాద్రి మీద వారాహీ నవరాత్రులుగా వ్యవహరించే ఆషాఢమాస గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇవాళ జులై 6 నుంచి జులై 15 వరకూ అమ్మవారికి పంచవారాహీ మంత్రాలతో జపతపాదులు, హోమాలు జరుగుతాయి.
సనాతన సంప్రదాయంలో వారాహీ నవరాత్రులు అత్యంత మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి అన్న విశ్వాసం ఉంది. వారాహీ దేవి స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖము, అష్టభుజాలు, శంఖ-చక్ర-హల-ముసల-పాశ-అంకుశ-వరద-అభయ హస్తాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. వారాహి అంటే భూదేవికి, ధాన్యలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. ఆ దేవత చేతిలోని నాగలి వ్యవసాయ పనులకు, రోకలి ధాన్యం దంచడానికీ ఉపయోగిస్తారు. సస్యదేవత అయిన వారాహీదేవి పాడిపంటలను సమృద్ధిగా ఇస్తుందని భక్తుల విశ్వాసం. అదే సమయంలో వారాహీదేవి ఉగ్రరూపిణి అయి శత్రునాశనం చేస్తుందని కూడా విశ్వసిస్తారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి’ పేరుతో ప్రచారవాహనాన్ని తయారుచేయించుకున్నారు. అప్పటినుంచీ వారాహీదేవి గురించి సామాన్య ప్రజల్లో ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం, రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కావడం, ఆ వెంటనే 11 రోజుల వారాహీ దీక్ష చేపట్టడంతో జనసామాన్యంలో ఈ పూజలపై ఆసక్తి పెరిగింది. ఆ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మీద మొదటిసారి వారాహీ నవరాత్రులు చేపట్టడం ఆసక్తి కలిగిస్తోంది.