ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇకపై తనిఖీ అక్కర్లేదు. పైగా, రెండే రోజుల్లో సర్టిఫికెట్ చేతికి అందుతుంది. యోగీ ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్ర్రక్రియను సరళీకరించింది.
ఎవరైనా వ్యక్తి సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయని తహసీల్దారు భావిస్తే, తనిఖీ లేకుండా రెండే రోజుల్లో కులధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు. అయితే, ఏదైనా ఫిర్యాదు వస్తేనో లేక వివాదం రేగితేనో ఆ సర్టిఫికెట్ వెంటనే రద్దు చేయవచ్చు. ఆ మేరకు ఉత్తరప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గురుప్రసాద్ జీఓ జారీ చేసారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు ఉన్నాయి. ఎవరైనా తమ ఇంట్లోనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ అయ్యాక తనిఖీ కోసం తహసీల్ కార్యాలయానికి వెళ్ళడం తప్పనిసరి. ఇకపై అలాంటి తనిఖీ లేకపోయినా సర్టిఫికెట్ చెల్లుబాటవుతుంది.
కులధ్రువీకరణ పత్రం కోసం అభ్యర్ధి ఆధార్ కార్డు, సెల్ఫ్ ఎటెస్టెడ్ డిక్లరేషన్ ఫాం, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఇంటి చిరునామా అవసరం అవుతాయి. ఇ-డిస్ట్రిక్ట్ పోర్టల్‌కు లాగిన్ అయి, అందులో మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ కార్డు వివరాలు నింపాలి. అందులో కనిపించే వివరాలతో తహసీల్దారు సంతృప్తి చెందితే ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ కేటగిరీకి చెందిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఓబీసీ నాన్-క్రీమీలేయర్ కేటగిరీకి దరఖాస్తుదారు ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా దాఖలు చేయాలి.
ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు కులధ్రువీకరణపత్రాలు జారీ అయితే, వాటిని తనిఖీ చేసి పాత పద్ధతిలో జారీ చేస్తారు.