రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు. ఏపీ 11 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని, జీఎస్డీపీలో 33 శాతం అప్పులున్నాయని కేంద్రం ఆదుకోవాలంటూ చంద్రబాబు వినతులు సమర్పించారు. కేంద్రం సాధ్యమైనంత ఆర్థిక సాయం చేసేందుకు హామీ ఇచ్చింది. వెనుకబడిన జిల్లాలకురావాల్సిన బకాయిలను విడుదల చేయాలని చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఇందుకు నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. అమరావతి అవుటర్‌రింగ్ రోడ్డుకు మోక్షం లభించింది. 189 కి.మీ రింగ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.
ఢిల్లీలో చంద్రబాబు రెండు రోజులు బిజీగా గడిపారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలసి ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అమరావతి బెంగళూరు 12 లైన్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు రావడానికి ఈ జాతీయ రహదారి కీలకంగా మారనుంది. ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్కు కేంద్రం అనుమతించింది. త్వరలో ఈ రహదారి పనులు ప్రారంభం కానున్నాయి.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబానాయుడు శనివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. ఇద్దరు సీఎంలు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూల్లోని ఆస్తుల పంపకాలు, కృష్ణా జలాల పంపిణీపై చర్చించనున్నారని తెలుస్తోంది.