కర్ణాటక సంగీతంతో కొద్దిపాటి పరిచయం ఉన్నవారెవరికైనా తెలిసిన పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య అప్పట్లో ప్రముఖ వేణువిద్వాంసుడు. తల్లి సూర్యకాంతమ్మ వీణావాదనంలో నేర్పరి. ఆవిడ బాలమురళి బాల్యంలోనే కన్నుమూసారు.
మురళీకృష్ణ పేరుకు ముందు ‘బాల’ ఆయన తల్లిదండ్రులు పెట్టినది కాదు. బాలమురళి, గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర సంగీతం అభ్యసించారు. ఎనిమిదో ఏట మొదటి కచేరీ చేసారు. ఆయనకు అరగంట సమయం కేటాయించారు. కానీ ఒకసారి మురళీకృష్ణ పాడడం మొదలుపెట్టాక ఎవరికీ సమయం తెలియలేదు. మూడుగంటల పాటు నిర్విరామంగా కచేరీ కొనసాగింది.
ఆ కచేరీకి హరికథకుడు ముసునూరు సూర్యనారాయణమూర్తి భాగవతార్ హాజరయ్యారు. చిన్నారి మురళీకృష్ణ గానానికి మంత్రముగ్ధుడైపోయారు. ఆ పిల్లవాడి పేరు ముందు ‘బాల’ అని పెట్టారు. అప్పటినుంచీ ఆ బాలమేధావి బాలమురళీకృష్ణ అయ్యాడు.
పిన్నవయసు నుంచీ సంగీతాన్నే శ్వాసించిన బాలమురళి సాధారణ పాఠశాల విద్య వదిలిపెట్టేసాడు. అయితే ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసిందే లేదు. గాత్రంతో ఆగిపోలేదు. సంగీత పరికరాలు సైతం ఆయన చేతిలో కరిగి నీరైపోయాయి. కంజిర, మృదంగం, వయొలిన్ వంటి పరికరాల వాదనలో బాలమురళి దిట్ట.
బాలమురళి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో సంగీత కచేరీలు చేసాడు. కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాలేదు. లలిత సంగీతం, సినీగీతాలూ పాడాడు. 1967లో భక్తప్రహ్లాద చిత్రంలో నారదుడిగా నటించాడు కూడా.
శాస్త్రీయ కర్ణాటక సంగీతం అంటే బాలమురళీకృష్ణ అన్నంత పేరు ప్రఖ్యాతులు సాధించాడు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు. సంగీతవేత్త, స్వరకర్త, నేపథ్య గాయకుడు, వాగ్గేయకారుడు, కవి, నటుడు, పలు సంగీత పరికరాలను వాయించగల విద్వాంసుడు… ఇలా అసాధారణ బహుముఖ ప్రజ్ఞాశాలి బాలమురళి.
బాలమురళి ప్రతిభ కర్ణాటక సంగీతానికే పరిమితం కాలేదు. పండిట్ భీమ్‌సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరసియా, కిశోరీ అమోన్‌కర్ వంటి హిందుస్తానీ సంగీత విద్వాంసులతో పలు జుగల్‌బందీలు చేసాడు. పలువురు విదేశీ సంగీత విద్వాంసులతోనూ కలిసి పనిచేసాడు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, కెనడా, ఇటలీ, సింగపూర్, మలేషియా వంటి ఎన్నో దేశాల్లో సంగీతప్రేమికులు బాలమురళి పాటకు కట్టుబడిపోయారు.
బాలమురళీ గాయకుడు, స్వరకర్త, వాగ్గేయకారుడు మాత్రమే కాదు. ఎన్నో రాగాలు, తాళాలకు కల్పన చేసారు. తాను రూపొందించిన రాగాల్లో కీర్తనలు రాసారు. 72 మేళకర్త రాగాల్లోనూ స్వరాలు కట్టిన అరుదైన ఘనత ఆయన సొంతం. త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి తాళాలు ఆయన రూపొందించినవే.
కర్ణాటక సంగీత ప్రపంచానికి బాలమురళి సేవలు అసమానమైనవి. కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఆయన సంతృప్తి పడిపోలేదు. 72మేళకర్తలతో ‘రాగంగా రవళి’ పేరిట సంగీతం సమకూర్చారు. ఆయన చేసిన 400 పైగా స్వరకల్పనలను సంగీత ప్రేమికులు, విమర్శకులు అందరూ ఆమోదించారు. ఆయన రూపొందించిన రాగాల్లో మహతి, సుముఖం, త్రిశక్తి, ఓంకారి, జనసమ్మోదిని, మనోరమ, రోహిణి, వల్లభి, లవంగి, ప్రతిమధ్యమావతి, సుషమ, మురళి ముఖ్యమైనవి.
బాలమురళిని వరించి ఎన్నో పురస్కారాలు తమ స్థాయిని పెంచుకున్నాయి. భారత ప్రభుత్వం ఆయనను దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో 1991లో సత్కరించుకుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం 2005లో షెవాలియర్ ఆఫ్ ది ఆర్డ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డె లెట్రెస్ పురస్కారం ప్రదానం చేసింది. 1975లో సంగీత నాటక అకాడెమీ అవార్డు వరించింది. 1978లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఆయనను సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది. మరెన్నో పురస్కారాలు, వేలాది సన్మానాలు ఆయన సంగీతకిరీటంలో భాసిల్లుతున్నాయి.
సినీరంగంలోనూ బాలమురళి కృషికి గుర్తింపు లభించింది. 1986లో మధ్వాచార్య అనే కన్నడ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, 1987లో కన్నడ చిత్రం హంసగీతెలో ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ రెండు జాతీయ ఫిలిం అవార్డులు లభించాయి. 1987లో స్వాతి తిరునాళ్ చిత్రంలో ఉత్తమ గాయకుడిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. 2010లో గ్రామమ్ చిత్రంలో ఉత్తమ శాస్త్రీయ సంగీత గాయకుడిగా కేరళ ప్రభుత్వ అవార్డు గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆయనను రాష్ట్ర పురస్కారంతో గౌరవించింది. 2009లో పాశాంగ చిత్రంలో గానానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారం ఆయనను వరించింది.
బాలమురళి గానం ‘సన్నజాజుల రవళి’లా ఉంటుందన్నారు ప్రముఖ రచయిత వడ్డెర చండీదాస్. అలాంటి జాజిపువ్వు 2016 నవంబర్ 22న ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయింది.