(శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి నేడు)
ఇవాళ (జులై 6) డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి. భారత రాజకీయ చరిత్రలో శ్యామాప్రసాద్ ముఖర్జీ శిఖరాయమానుడు. గొప్ప దార్శనికత గల నేత. ఆయన బారిస్టర్, విద్యావేత్త, జాతీయ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు. 1901లో జన్మించిన శ్యామాప్రసాద్ బహుముఖీన ప్రజ్ఞ స్వతంత్రానంతర భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది.
శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్‌లో ప్రముఖ న్యాయమూర్తి, విద్యావేత్త ఆశుతోష్ ముఖర్జీ కుమారుడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక 1923లో సెనేట్‌లో సభ్యుడయ్యారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 1924లో కలకత్తా హైకోర్టులో అడ్వొకేటుగా నమోదు చేసుకున్నారు. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ చేరుకున్నారు. 1927లో బారిస్టర్ పట్టా పొందారు. 33ఏళ్ళ వయసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి అతిచిన్న వయస్కుడైన వైస్‌ఛాన్సలర్ అయ్యారు. 1938వరకూ ఆ పదవిలో కొనసాగినంత కాలం యూనివర్సిటీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
ముఖర్జీ రాజకీయ జీవితం బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కలకత్తా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రారంభమైంది. అయితే లెజిస్లేచర్‌ని బాయ్‌కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో ఒక్క యేడాదిలోనే కౌన్సిల్‌కు రాజీనామా చేసారు. తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించారు. 1937 నుంచి 1941 వరకూ కృషక్ ప్రజా పార్టీ – ముస్లింలీగ్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తర్వాత ఫజల్ ఉల్ హక్ ఏర్పాటు చేసిన అభ్యుదయ సంకీర్ణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసారు. అయితే ఏడాది తిరక్కముందే సైద్ధాంతిక భేదాలతో ఆ పదవికి రాజీనామా చేసారు.
హిందువుల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ హిందూమహాసభలో చేరారు. ఆ సంస్థకు 1943 నుంచి 1946 వరకూ అధ్యక్షుడిగా ఉన్నారు. గాంధీ హత్య తర్వాత ఆయన హిందూమహాసభను రాజకీయ పార్టీగా మార్చి అందులో అన్ని మతాల వారికీ చోటు కలిపిద్దామని భావించారు. ఆ విషయంలో సైద్ధాంతిక విభేదాల కారణంగా ఆయన 1948లో హిందూమహాసభ నుంచి బైటకు వచ్చేసారు.
జవాహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన మధ్యంతర కేంద్ర ప్రభుత్వంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసారు. అయితే నెహ్రూతో కూడా సైద్ధాంతిక విభేదాలు తప్పలేదు. ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీఖాన్‌తో నెహ్రూ ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకోడాన్ని శ్యామాప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. నెహ్రూ క్యాబినెట్‌కు 1950 ఏప్రిల్ 6న రాజీనామా చేసారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ తన సిద్ధాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉన్నారని ఆ సంఘటన మరోసారి రుజువు చేసింది. పైగా, కాంగ్రెస్ నాయకత్వంపై భ్రమలు తొలగిపోయి, ఆయనలో అసంతృప్తి రాజుకుంది.
భారతీయ జనసంఘ్ స్థాపన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతుతో శ్యామాప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న ఢిల్లీలో భారతీయ జనసంఘ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కాలక్రమంలో అదే భారతీయ జనతా పార్టీగా మారింది. మొదటి అధ్యక్షుడిగా ఆయన 1952 ఎన్నికల్లో పార్టీని నడిపించారు. ఆయన, మరో ఇద్దరు అభ్యర్ధులు పార్లమెంటు సీట్లు గెలిచారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ పార్లమెంటులో 32మంది ఎంపీలు, 10మంది రాజ్యసభ సభ్యులతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసారు. అయితే దానికి అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కలేదు. రాజకీయాల్లో ఆయన నిశిత బుద్ధి, ముక్కుసూటితనం వల్ల ప్రత్యర్థులతో సహా అన్ని రాజకీయ పార్టీల వారూ ఆయనను గౌరవించేవారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని శ్యామాప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చర్య భారత ఐక్యతకు ప్రమాదకరమని ఆయన వాదించారు. భారతదేశాన్ని బాల్కనైజేషన్ వైపు నెట్టేసే చర్యగా దాన్ని అభివర్ణించారు. భారత రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370 తొలగించాలంటూ భారీ సత్యాగ్రహంతో తమ నిరసన వ్యక్తం చేసారు. హిందూమహాసభ, రామరాజ్య పరిషత్‌లతో కలిసి పెద్దస్థాయిలో సత్యాగ్రహం చేసారు. కశ్మీర్ వెళ్ళడానికి అప్పటి భారతప్రభుత్వం ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ధిక్కరించి వెళ్ళిన ఆయనను 1953 మే 11న అరెస్ట్ చేసారు. జైలు కస్టడీలోనే ఆయన అనుమానాస్పద రీతిలో 1953 జూన్ 23న తుదిశ్వాస విడిచారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ అకాల మరణం దేశానికి తీరనిలోటు. ఆయన మృతికి దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తర్వాతనే, కశ్మీర్‌లో ప్రవేశానికి పర్మిట్ విధానాన్ని భారత ప్రభుత్వం తొలగించింది. ‘‘నా కుమారుడు దేశమాత కోసం ప్రాణాలు అర్పించాడు’’ అంటూ శ్యామాప్రసాద్ తల్లి జోగ్‌మాయాదేబి (యోగమాయా దేవి) ఎంతో హుందాగా స్పందించారు. శ్యామాప్రసాద్ దేశానికి కేవలం రాజకీయ రంగంలో మాత్రమే సేవ చేయలేదు. దేశ సమైక్యత, సమగ్రత కోసం నిబద్ధతతో కృషి చేసారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ దార్శనికత, కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడం కోసం ఆయన చేసిన అవిరళ కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకాలే. ఆయన జీవితం, సేవ దేశ రాజకీయ నాయకులకు ఎప్పటికీ మార్గదర్శకాలే.