2036లో జరగబోయే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్ విజయవంతం అవుతుందని తనకు పూర్తి నమ్మకముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఏర్పాట్లను గమనించబోయే అథ్లెట్లు ఆ విషయంలో సూచనలు ఇవ్వాలని కోరారు. పారిస్ వెళ్ళబోయే భారత క్రీడాకారుల జట్టుతో సమావేశమైన మోదీ, ఆ భేటీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
‘‘భారతదేశం ఒలింపిక్స్‌ను సమర్థంగా నిర్వహించగలదన్న విశ్వాసం ఉంది. ఒలింపిక్స్ నిర్వహణ వల్ల దేశంలో క్రీడారంగం మరింత విస్తరించే అవకాశం కలుగుతుంది. దానికి కావలసిన మౌలికవసతులను కల్పించే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి. సదుపాయాల కల్పన గురించి మీరు గమనించిన అంశాలను మాతో పంచుకోండి. మీ సూచనలు, సలహాలు 2036 ఒలింపిక్స్ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఉపయోగపడతాయి’’ అని మోదీ క్రీడాకారులకు చెప్పారు.
ఆ భేటీ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన నీరజ్ చోప్రా, మోదీకి ‘చుర్మా’ తినిపిస్తానని హామీ ఇచ్చాడు. పారిస్‌లో పతకం సాధించి మోదీతో కలుస్తాననీ, అప్పుడు ఆయన నోరు తీపి చేస్తాననీ నీరజ్ చోప్రా చెప్పాడు.