ఇంగ్లండ్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అయితే గత 37ఏళ్ళలో ఏనాడూ గెలవని ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ విజయం సాధించింది. అదే లీసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం. అక్కడ టోరీ పార్టీ అభ్యర్ధి శివానీ రాజా అనే హిందూ మహిళా ఎంపి. గత నాలుగు దశాబ్దాలుగా లేబర్ పార్టీ కంచుకోట అయిన లీసెస్టర్ ఈస్ట్‌ను కైవసం చేసుకున్నది భారతీయ మూలాలు కలిగిన మహిళ కావడం విశేషం.
లీసెస్టర్ ఈస్ట్‌లో 61శాతం ఓటింగ్ శాతం నమోదయింది. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధి శివానీ రాజాకు 14,526 ఓట్లు వచ్చాయి. అక్కడ లేబర్ పార్టీ అభ్యర్ధి రాజేష్ అగర్వాల్ 10,100 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంక లిబరల్ డెమొక్రాట్స్ పార్టీ అభ్యర్ధి జుఫర్ హక్ 6,329 ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
శివానీ రాజా తల్లిదండ్రులు కెన్యా, భారత్‌ల నుంచి 70లలో ఇంగ్లండ్ చేరుకున్నారు. శివానీ లీసెస్టర్‌లోనే పుట్టిన మొదటితరం బ్రిటిష్ పౌరురాలు. శివానీ డె మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఫార్మా అండ్ కాస్మెటిక్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రధాన కాస్మెటిక్స్ బ్రాండ్స్ కంపెనీల్లో కొంతకాలం పనిచేసింది.
శివానీ రాజా బాల్యం నుంచీ హిందూమతాన్ని అనుసరిస్తోంది. ఆ విషయాన్ని గర్వంగా చాటుకుంటుంది. గతనెల లీసెస్టర్‌లోని సనాతన్ మందిర్ 50ఏళ్ళ వార్షికోత్సవంలో పాల్గొంది. అంతకుముందు ఆధ్యాత్మిక ప్రవచనకర్త గిరిబాపు నిర్వహించిన ‘శివ కథ’ కార్యక్రమంలోనూ శివాని పాలుపంచుకుంది.
లీసెస్టర్ ఈస్ట్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన క్లాడియా వెబ్ కొన్నాళ్ళ క్రిందట ఖలిస్తానీ వేర్పాటువాదులకు బహిరంగంగా మద్దతు పలికింది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్తానీ మూక దాడి చేసినప్పుడు వారికి మద్దతుగా నిలిచింది. ఆమెకు ఈ ఎన్నికల్లో 5532 ఓట్లు లభించాయి.
లీసెస్టర్ ఈస్ట్‌లో హిందూ అభ్యర్ధి శివానీ రాజా విజయానికి గొప్ప ప్రాధాన్యతే ఉంది. 2022లో ఈ ప్రాంతంలోనే హిందువులపై ముస్లిములు దాడులు చేసారు. ఫలితంగా అక్కడి హిందూ సమాజంలో ఆందోళనలు నెలకొన్నాయి. హిందూ వ్యతిరేక శక్తులను నిలువరించాలంటే స్థానికంగా ఉన్న హిందూ సమాజం ఐకమత్యంగా ఉండడం తప్పనిసరి అన్న భావన నెలకొంది. దాని ఫలితమే ఈ గెలుపు అని భావించవచ్చు.
2022 సెప్టెంబర్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత లీసెస్టర్ ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి. హిందువుల ఇళ్ళు, వ్యాపారస్థలాలు, ప్రార్థనాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. దాంతో ఆ ప్రాంతంలోని హిందూ సమాజంలో అభద్రతాభావం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైరల్ అవడంతో హింసాకాండ తీవ్రరూపం దాల్చింది. పోలీసుల జోక్యం చేసుకుని పలువురిని అరెస్టు చేసిన తర్వాతే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఆ ఘర్షణల తర్వాత సెంటర్ ఫర్ డెమొక్రసీ, ప్లూరలిజం అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ లీసెస్టర్‌లో విస్తృతంగా పర్యటించి నిజనిర్ధారణ చేసింది. ఆ నివేదికను హౌస్ ఆఫ్ కామన్స్‌కు సమర్పించింది. లీసెస్టర్‌లో హిందువులపై దాడులు చేసిన ఘటనలను ఆ నివేదిక ‘ప్రజాస్వామ్య వ్యవస్థలు, చట్టబద్ధ పాలనపై ప్రత్యక్ష దాడి’గా అభివర్ణించింది. ఆ ప్రాంతంలో కొంతకాలంగా ముస్లిం జనాభా పెరిగిపోవడంతో అంతకుముందు ఆధిక్యంలో ఉన్న హిందూ జనాభా మైనారిటీగా మారిపోయింది. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంలో మజీద్ ఫ్రీమ్యాన్, మహమ్మద్ హిజాబ్ వంటి కొందరు ముస్లిం వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రచారం చేసి, తోటి ముస్లిములను రెచ్చగొట్టడంతో హింసాకాండ చెలరేగింది.
ఆ నేపథ్యంలో శివానీ రాజా గెలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు దశాబ్దాల లేబర్ ఆధిక్యానికి కన్జర్వేటివ్ పార్టీ మొదటిసారి అడ్డుకట్ట వేయడంలో స్థానిక హిందూ సమాజం కీలక పాత్ర పోషించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు