వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షాపత్రాల లీకేజీపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షలు రద్దు చేయడం హేతుబద్ధత కాదని..కోర్టుకు విన్నవించింది. పరీక్షలు రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయపడింది. నీట్ పేపర్ల లీక్‌పై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తోందని, కొందరిని అరెస్ట్ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి గుర్తు చేసింది. నీట్ పరీక్షాపత్రాలు పెద్ద ఎత్తున లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
వైద్య విద్యలో ప్రవేశానికి మే 5న దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీకైందనే ఆరోపణలపై బిహార్‌లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఒకటో ర్యాంకు 67 మందికి రావడం, ఒకే పరీక్షా కేంద్రంలో 8 ర్యాంకులు రావడంపై దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. దీనిపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. బిహార్‌లో పరీక్షా పత్రాల జవాబులు లీక్ చేసిన కొందరిని అరెస్ట్ చేశారు. ముంబైలోనూ కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల్లో ర్యాంకుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు ప్రారంభించనున్నారు. ఇలాంటి సమయంలో నీట్ రద్దు చేయడం హేతుబద్దత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.