పాసింజర్ రైళ్ళ కోసం 2,500 కొత్త జనరల్ బోగీలు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తయారవుతున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అటువంటి మరో 10వేల బోగీల తయారీకి ఆమోదం లభించిందని తెలియజేసారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచడానికి కేంద్రం దృష్టి సారించిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం మరో 50 అమృత్ భారత్ రైళ్ళు తయారవుతున్నాయని మంత్రి చెప్పారు. గతేడాది డిసెంబర్లో రెండు అమృత్ భారత్ రైళ్ళను మాల్డా, దర్భంగా నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరో 150 అమృత్ భారత్ రైళ్ళ తయారీ ప్రక్రియ మొదలైందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ యేడాది వేసవిలో ప్రయాణికుల రద్దీని తట్టుకోడానికి దేశవ్యాప్తంగా 10వేల ప్రత్యేక రైళ్ళు నడిపామని చెప్పారు.
రైల్వే మౌలిక వసతుల కల్పన గురించి మంత్రి చెబుతూ 5300 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు వేసామన్నారు. ఈ యేడాది ఇప్పటివరకూ 800 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్స్ వేసామని చెప్పారు. రైళ్ళ వేగాన్ని నియంత్రించడం కోసం, రైళ్ళ రక్షణ కోసం రూపొందించిన ‘కవచ్’ పద్ధతిని దేశమంతటా అందుబాటులోకి ప్రక్రియ వేగంగా సాగుతోందని మంత్రి చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారాలపై రైల్వేమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. 12లక్షల మంది రైల్వే ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని విపక్షాలు దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ‘‘వాళ్ళు పాత వీడియోలను వైరల్ చేస్తూ, రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారాన్ని మా రైల్వే ఉద్యోగులు వమ్ముచేస్తారు’’ అని మంత్రి చెప్పుకొచ్చారు.