ప్రకృతిని తల్లిగా భావించే సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే ‘అమ్మ కోసం ఒక చెట్టు’ పేరిట జాతీయ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఇవాళ విజయవాడలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి 23 జూన్ నుంచి ఆయన జయంతి జులై 6 వరకూ మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుంది.
విజయవాడ బిఆర్టిఎస్ రోడ్డులో కేంద్రీయ విద్యాలయం ఎదురుగా పురందరేశ్వరి మొక్కలు నాటారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని వాతావరణ పరిస్థితుల్లో అసమతౌల్యం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఒకపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతుంటే మరోవైపు వర్షాలు సక్రమంగా కురవడం లేదన్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల రైతులు, ప్రజలు నష్టాలు చవిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. చెట్లను పెంచడం ఒక్కటే పర్యావరణాన్ని రక్షిస్తుందనీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను సవరిస్తుందనీ వివరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.