అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ అనే రాడికల్ మతబోధకుడిని అరెస్ట్ చేసారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ జిల్లా ఎస్పికి వ్యతిరేకంగా హింసాయుత నిరసనకు పిలుపునిస్తూ అతను ముస్లిములను రెచ్చగొడుతూ ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు దర్రాంగ్ జిల్లా పోలీసులు అజారీని అరెస్ట్ చేసారు.
అజారీ, ఈ శనివారం నాడు (జులై 6) లఖీంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చాడు. 6 నుంచి 10వ తేదీ వరకూ రాష్ట్రంలో ప్రజాజీవనానికి అంతరాయం కలిగేలా భారీ ఆందోళనలు చేపడతామని బెదిరింపులు జారీ చేసాడు. అజారీ బెదిరింపులను రాష్ట్ర మంత్రి పిజూష్ హజారికా ఖండించారు. ‘‘ఈద్ సందర్భంగా, మైనారిటీ మతానికి చెందిన ఒక వ్యక్తి తన తోటివారికి ఆవులను బలి ఇవ్వవద్దని చెప్పడం వల్లనే ఇదంతా జరుగుతోంది. దయతో కూడిన అటువంటి విజ్ఞప్తికి ఇంతటి ద్వేషాన్ని ప్రదర్శించడం అనూహ్యంగా ఉంది. ఇప్పుడతను (అజారీ) అస్సాం పోలీసులను సవాల్ చేసాడు, హింసాకాండకు పిలుపునిచ్చాడు. ఇంతకీ అస్సాం ఎటు పోతోంది?’’ అంటూ మంత్రి పిజూష్ ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేసారు.
అస్సాంకు చెందిన ముస్తఫా కెమాల్ అనే మౌల్వీ ఇటీవల బక్రీద్ సమయంలో గోవధ చేయవద్దంటూ ముస్లిములకు విజ్ఞప్తి చేసాడు. ఈద్ సందర్భంగా బలి ఇవ్వడం ముఖ్యమే కానీ ఆవును బలి ఇవ్వాలని ఎక్కడా లేదని ఆయన చెప్పాడు. ఇస్లాం మతంలో ఆవును మాత్రమే బలి ఇవ్వాలని ఎక్కడా లేదని ఆయన చెప్పాడు. ఆ వ్యాఖ్యలను అస్సాంలోని ఇస్లామిస్టులు ఖండించారు. ఆ సందర్భంగా ముస్తఫా కెమాల్‌ను బెదిరిస్తూ ముస్లిం ప్రబోధకుడు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
ముఫ్తీ అజారీ ఫేస్బుక్ లైవ్ సెషన్లో తాను లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ ‘దెయ్యం’ ముస్తఫా కెమాల్ ఇంటి దగ్గరా జులై 6, 10 తేదీల్లో ఘెరావ్ చేస్తానని ప్రకటించాడు. తనతో చాలామంది కలిసొస్తారని గప్పాలు కొట్టాడు. తమ భావాలతో ఏకీభవించే పలువురు తనతో ఆ దాడిలో పాల్గొంటారని హెచ్చరించాడు. ‘‘ఆ వ్యక్తి (ముస్తఫా కెమాల్) దమ్ము ఎంతో తెలుసుకోవాలి. ఉత్తర లఖీంపూర్ స్టేషన్ నుంచి నాకొక పోలీస్ కాల్ చేసాడు. 6న అక్కడకు రావద్దని చెప్పాడు. అతని ఫోన్ నెంబర్ మీకు బ్రేక్ సమయంలో ఇస్తాను. అతనే ఇన్ఛార్జ్ అధికారా అని అడిగాను. ఒకవేళ అతను ఇన్ఛార్జే అయుంటే నా మాటలు గుర్తుపెట్టుకోవాలి. నేను కచ్చితంగా ఆరోజు వచ్చితీరతాను. ఇన్షా అల్లా’’ అంటూ ముఫ్తీ అన్సారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఎస్పి లేదా డిసిపి వచ్చినా, తన ప్రణాళికను ఎవరూ ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేసాడు.
ముస్తఫా కెమాల్‌ను దూషిస్తూ అజారీ ఇలా చెప్పాడు. నేను అతని వెంట పడతాను. ఈ ఆటను మొదలుపెట్టిందే అతను. ఇదే అతనికి చివరి అవకాశం. ఆ తర్వాత ఆటకు నేను ముగింపు ఇస్తాను. ఇస్లాం ప్రచారానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. నువ్వు ఇస్లాంను అవమానిస్తావా? నువ్వు మహమ్మద్ ప్రవక్తను సైతాను అంటున్నావు. వాళ్ళు నా కాళ్ళూ చేతులూ విరిచేసినా, నేను అక్కడికే వెడతాను. అతన్ని ఏ పోలీసుకైనా ఫోన్ చేసుకోమనండి, వాళ్ళు నన్ను అక్కడికి వెళ్ళకుండా అడ్డుకోలేరు. నేను నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాను. అతను కేవలం ఆర్ఎస్ఎస్ నుంచి మాత్రమే సంపాదిస్తాడు. నామీద పరువునష్టం దావా వేసినా సరే, అదే నిజం. అతను నూరు శాతం ఆర్ఎస్ఎస్ వ్యక్తి. అతనో బంగ్లాదేశీ నాస్తికుణ్ణి కూడా కలిసాడు.’’
లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర జిహాదీ ఆందోళన చేపట్టకుండా తనను ఎవరూ ఆపలేరని అజారీ చెప్పాడు. ‘‘ఇస్లాం మతం, ప్రవక్త గురించి అమర్యాదగా మాట్లాడితే నేను సహించను. నేను యుద్ధం ప్రకటిస్తాను, ఆందోళన చేస్తాను. నా వీడియోను ఎస్పికి చూపించండి. నేను రాజ్యాంగం ప్రకారం ఆందోళన చేస్తాను. హడీత్, కురాన్, అల్లా, ప్రవక్తను విశ్వసించే స్వాతంత్ర్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు ఇచ్చింది’’ అని అజారీ చెప్పుకొచ్చాడు.
ముస్తఫా కెమాల్‌ను బెదిరిస్తూ అజారీ ఇలా చెప్పాడు ‘‘అతనికి అనుమతి ఎవరిచ్చారు? మా నబీని, కురాన్ను తక్కువ చేయడానికి అతనికి ఏ ఆర్ఎస్ఎస్ అనుమతి ఇచ్చింది? నేను అతన్ని పట్టుకుని తీరతాను. నువ్వు ఇస్లాంను, కురాన్ను, మహమ్మద్ ప్రవక్తను లేదా నబీని అగౌరవపరిస్తే మేం చూస్తూ కూర్చోము. మేమేం చేతులు కట్టుకుని ఉండిపోము. అస్సాం నీ అబ్బ సొత్తు కాదు. నేను మీ ఊరికొస్తా, మీ ప్రాంతానికి వస్తా, నీ దమ్మేంటో చూస్తా’’ అంటూ బెదిరించాడు.
ముస్తఫా కెమాల్‌ను హెచ్చరిస్తూ, పోలీసులను ధిక్కరిస్తూ అజారీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పోలీసులు అజారీని జులై 2న అరెస్ట్ చేసారు. ధూలియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగల్దోయ్ కోర్టుముందు అజారీని ప్రవేశపెట్టారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు