తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్ పార్టీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా పార్టీ నుంచి నాయకులు వలసబాట పడుతూనే ఉన్నారు. సీనియర్ నేత కే కేశవరావు కాంగ్రెస్‌లోకి చేరి రెండ్రోజులైనా గడవకముందే పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కేసీఆర్ కారు దిగి రేవంత్ రెడ్డి హస్తం అందుకున్నారు.
గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారత రాష్ట్ర సమితికి చెందిన దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ అనే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ ప్రక్రియ సాగిపోయింది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో భేటీ అయ్యారు. రాత్రి 11.30 సమయంలో వారు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే రాష్ట్ర మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీనుంచి హైదరాబాద్ స్వగృహానికి చేరుకున్న మరికొంత సేపటికే ఈ కార్యక్రమం పూర్తయింది.
బుధవారం నాడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు, గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఇంకా రెండేళ్ళ పదవీ కాలం ఉన్నా, ఆ పదవి బిఆర్ఎస్‌లో ఉండగా వచ్చినందున రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.
40మంది సభ్యుల తెలంగాణ శాసనమండలిలో బిఆర్ఎస్ పరిస్థితి దిగజారుతోంది. కొన్నాళ్ళ క్రితమే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. వారు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలె యాదయ్య. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరారు.