ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. జులై 8,9,10 తేదీల్లో ప్రధాని రష్యాలో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రధాని రష్యాలో పర్యటించడం ఐదేళ్ల తరవాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మూడు రోజుల రష్యా పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తరవాత ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీ 22వ రష్యా భారత్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పలు అంశాలపై భారత్ రష్యా అధినేతలు చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రధానంగా చర్చ సాగనుంది. రష్యా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 సంవత్సరాల తరవాత ఇదే మొదటి సారి. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెన్ బెలెన్‌తో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.