తేజస్విని మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. విజయవాడ రామవరప్పాడులో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోన్న తేజస్విని మిస్సింగ్ కేసు కొలిక్కి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
భీమవరానికి చెందిన ప్రభాకరరావు, శివకుమారి దంపతుల కుమార్తె తేజస్విని విజయవాడలోని పెద్దమ్మ వద్ద ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతోంది. నిడమానూరుకు చెందిన అంజాద్ మాయమాటల్లో పడింది. ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి 9 నెలల కిందట యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో యువతి వద్ద ఉన్న నగలు, ఫోన్ అమ్మేశాడు. అక్కడ నుంచి బెంగళూరు, ముంబై,కేరళ వెళ్లారు. ఆ తరవాత యువతిని తీసుకుని జమ్ము కశ్మీర్ వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో పనికి కుదిరాడు. 8 నెలలుగా అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది.
తేజస్విని తల్లిదండ్రులు, అక్కతో మాట్లాడకుండా జాగ్రత్తపడ్డ అంజాద్, ఆమెకు ఫోన్ అందకుండా చేశాడు. ఓ రోజు రాత్రి అతడు బయటకు వెళ్లిన సమయంలో అంజాద్ ఫోన్ నుంచి తేజస్విని, ఆమె అక్కకు ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టింది. తేజస్విని అక్క ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను విజయవాడ మాచవరం పోలీసులకు చూపడంతో అంజాద్ జమ్మూలో ఉన్నట్లు గుర్తించి, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే అంజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో వారిని బుధవారంనాడు విజయవాడకు తరలించారు. అంజాద్‌ను విచారించిన తరవాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందని విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్‌డి రాషకృష్ణ మీడియాకు తెలిపారు.