విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీర్ జవాను అజయ్‌కుమార్‌కు భారత సైన్యం నివాళులర్పించింది. అతని కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించినట్లు తెలియజేసింది. మరికొంత పరిహారం సుమారు 67 లక్షలు చెల్లించాల్సి ఉందని, పోలీస్ వెరిఫికేషన్ పూర్తయాక ఫైనల్ అకౌంట్ సెటిల్మెంట్ కొద్దిరోజుల్లో జరుగుతుందని ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
భారత సైన్యం అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ఎడిజిపిఐ) బుధవారం నాడు అగ్నివీర్ అజయ్‌కుమార్‌కు జీతభత్యాలపై వివరణ ఇచ్చారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అజయ్ కుమార్ కుటుంబానికి పరిహారం చెల్లించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వివరణ వెలువడింది.
‘‘అగ్నివీర్ అజయ్‌కుమార్ త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోంది. అజయ్ అంతిమ సంస్కారాలు సైనిక వందనంతో జరిగాయి. అజయ్ కుటుంబానికి చెల్లించవలసిన మొత్తంలో రూ.98.39 లక్షలు ఇప్పటికే చెల్లించివేసాం’’ అంటూ ఎడిజిపిఐ, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
‘‘ఎక్స్‌గ్రేషియా, మిగతా బెనిఫిట్స్ అన్నీ కలిపి అగ్నివీర్ పథకం కింద సుమారు 67 లక్షలు చెల్లించాల్సి ఉంది. పోలీస్ వెరిఫికేషన్ లాంఛనం పూర్తయ్యాక ఫైనల్ అకౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది. మొత్తంగా సుమారు 1.65 కోట్లు అవుతుంది. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి కుటుంబానికి జీతభత్యాలు, పరిహారం చెల్లింపు వేగంగా జరుగుతుందని పునరుద్ఘాటిస్తున్నాం’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అగ్నివీర్ పథకం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అబద్ధాలు చెప్పారని ఆరోపిస్తూ మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ ‘‘ప్రతీ మతంలోనూ సత్యానికి ప్రాధాన్యం ఉంది. దేశానికి, సైనిక దళాలకు, అగ్నివీర్‌లకు ఇచ్చే పరిహారం గురించి రాజ్‌నాథ్ సింగ్ శివదేవుడి పటం ముందు అబద్ధం చెప్పారు. నా మాటలో, రాజ్‌నాథ్ మాటలో కాదు, అగ్నివీర్ కుటుంబం మాటలు వినండి’’ అని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్‌సింగ్ తండ్రి, తమకు పరిహారం అందలేదని చెబుతున్న వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేసారు.
‘‘మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కానీ మాకు అదేమీ అందలేదు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సాయం అందాలంటూ రాహుల్ గాంధీ మా తరఫున పార్లమెంటులో మాట్లాడుతున్నారు. అగ్నివీర్ నియామకాలు ఆపేయాలి, సాధారణ నియామకాల ప్రక్రియను పునరుద్ధరించాలి’’ అని అజయ్‌సింగ్ తండ్రి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ‘‘రక్షణ మంత్రి అజయ్‌సింగ్ కుటుంబానికి, సైన్యానికి, ఈ దేశపు యువతకూ అబద్ధాలు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. భయపడవద్దు, భయపెట్టవద్దు’’ అని సుద్దులు చెప్పారు.
జూన్ 1న పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ అగ్నివీర్ పథకం గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసామని చెప్పారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ లోక్‌సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
23ఏళ్ళ అజయ్‌కుమార్ జనవరి 18న జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.