రాష్ట్రంలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించిన హైకోర్టు, ప్రతీదశలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతల గురించి ఆలోచన చేయాలని తేల్చి చెప్పింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్సార్‌సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని పేర్కొన్న కోర్టు అదనపు ఆధారాలు ఉంటే రెండు వారాల్లో సమర్పించాలని తెలిపింది.
టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు.
ఎన్నికల రోజున ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరులో జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని , జగన్ పరామర్శించారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టి , హత్యానేరం మోపారన్నారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవన్నారు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు.
ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదన్న జగన్ , చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10 శాతం ఓట్లతో టీడీపీ గెలిచిందన్నారు.