ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో 45 నిమిషాలు పాటు చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అవసరాలను ప్రధానికి చంద్రబాబు వివరించారు.
దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలపై చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ విస్ట్రా గురించి పీయూష్ గోయల్ చంద్రబాబుకు వివరించారు.
నేటి మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సేంగ్ చౌహాన్, మ. 2.45 గంలకు హోంమంత్రి అమిత్ షా, సాయంత్రం 5.15 గంటలకు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సాయంత్రం 6 గంటలకు పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
బుధవారం రాత్రికే దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఏపీ ఎన్డీయే ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై ఎంపీలతో సమాలోచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై మార్గనిర్దేశం చేశారు.
చంద్రబాబు తో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్లీ పర్యటనలో ఉన్నారు. వీరిద్దరూ శనివారం నాడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.