ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భోలేబాబా సత్సంగ వేదిక వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ ఇంక్వైరీ జరగనుంది. ఇవాళ హత్రాస్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ మేరకు ప్రకటన చేసారు. దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని యోగి చెప్పారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. తొక్కిసలాట బాధితులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆ తర్వాత తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించారు. దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షులైన మహిళలను, స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హత్రాస్ జిల్లా సికందరరావ్ ప్రాంతంలో సత్సంగం నిర్వాహకులుగా వ్యవహరించిన దేవప్రకాష్ మధుకర్, తదితరుల పేరు మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. సత్సంగం ముగింపు దశలో తొక్కిసలాట చోటు చేసుకుని 121మంది దుర్మరణం చెందారు. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఘటనా స్థలానికి పంపిచారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి 24గంటల్లో తనకు నివేదిక అందించాలంటూ ఆగ్రా ఏడీజీ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు.