తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన సొంతగూటికి మళ్ళీ చేరారు. కేకేకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ పాల్గొన్నారు.
కేశవరావు మొదట్లో కాంగ్రెస్‌లోనే ఉండేవారు. పార్టీలో ఎన్నో పదవులు కూడా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావుకు సన్నిహితుడిగా పేరు పొందారు. బి(టి)ఆర్ఎస్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ముందు కేశవరావు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కేశవరావు కాంగ్రెస్‌లోకి పునఃప్రవేశం చేసారు.
తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీలోని నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మళ్ళుతున్నారు. తమ పార్టీ నాయకులను నిలుపుకోడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.