ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతున్నాయి కానీ వాటికి తమ జవాబులను వినలేకపోతున్నాయని, సభ నుంచి పారిపోతున్నాయనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి జవాబిస్తూ ఆయన రాజ్యసభలో ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకోడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దాంతో ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు సభనుంచి వాకౌట్ చేసారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీ వారిపై వ్యంగ్యవ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘‘ప్రభుత్వాన్ని ఆటో పైలట్, రిమోట్ పైలట్ పద్ధతిలో నడపడానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. వాస్తవంగా పనిచేయడంలో వారికి నమ్మకం లేదు. వేచి చూడడం మాత్రమే వాళ్ళకి తెలుసు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలు సోనియాగాంధీని ఉద్దేశించి చేసినవే. యూపీయే రెండు దఫాల పాలనలో మన్మోహన్సింగ్ను ముందు పెట్టి సోనియాగాంధీయే రిమోట్కంట్రోల్లా ప్రభుత్వాన్ని నడిపించేదని బీజేపీ ఆరోపణ. దానికి అనుగుణంగానే ప్రధాని సోనియా పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసారు.
‘‘కానీ మేం కష్టపడి పనిచేస్తాం. ఆ ప్రయత్నంలో ఏ లోపమూ రానీయం. గత పదేళ్ళలో మేము చేసిన పనులను కొనసాగిస్తాం. దేశం కోసం మా కలలను పరిగణనలోకి తీసుకుంటే, ఆ పదేళ్ళూ కేవలం ఎపిటైజర్ మాత్రమే. అసలు భోజనం ఇప్పుడే మొదలైంది’’ అన్నారు మోదీ.
ప్రధానమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోడానికి ప్రతిపక్ష సభ్యులు అడుగడుగునా ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ రాజ్యసభ చైర్మన్‌ను పదేపదే అడిగారు. ఇక విపక్ష ఎంపీలు తమ నాయకుణ్ణి మాట్లాడనివ్వాలంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. తర్వాత ప్రధానిని ఉద్దేశించి ‘‘అబద్ధాలు చెప్పడం ఆపాలి, సిగ్గుపడాలి’’ అంటూ నినాదాలు చేసారు.
ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదని సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘ఇటువంటి అన్‌పార్లమెంటరీ ప్రవర్తనను ఖండిస్తున్నాను. దయచేసి మీరు మీ మీ స్థానాలలో కూర్చోండి’’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. అయినా ప్రతిపక్షాలు నినాదాలు చేయడం ఆపలేదు. ఆ దశలో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ఒకసారి ఆపారు. ‘‘విపక్షాల చర్యలను దేశం మొత్తం చూస్తోంది. అబద్ధాలు వ్యాపించేస్తున్నవారికి నిజాన్ని వినే ధైర్యం లేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తుంటే కూర్చుని వినలేకపోతున్నారు. వారు పెద్దల సభను, దాని సంప్రదాయాలనూ అవమానిస్తున్నారు. వారిని ప్రజలు అన్నిరకాలుగానూ ఓడించారు. ఇంక వారికి అరవడం తప్ప వేరే దారులేవీ మిగల్లేదు’’ అని ఘాటుగా స్పందించారు. ‘‘నినాదాలు చేయడం, అరుపులు కేకలు పెట్టడం, పారిపోవడం… వారి గతి అంతే’’ అని మోదీ మండిపడ్డారు.
ప్రతిపక్షాల ప్రవర్తన బాధా కలిగించిందన్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్. ‘‘ప్రతిపక్ష నాయకుడికి ఏ అవాంతరాలూ లేకుండా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాను. వారు సభను వదిలిపోలేదు, సభ్యతను వదిలిపెట్టేసారు. వారు అవమానించింది నన్ను కాదు, రాజ్యాంగాన్ని. వారు అగౌరవపరిచింది మనను కాదు, తాము చేసిన వాగ్దానాన్ని. రాజ్యాంగానికి ఇంతకు మించిన అగౌరవం ఉండదు. వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఆత్మవిమర్శ చేసుకుని సరైన దారిలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.
ప్రధానమంత్రి ఇవాళ కాంగ్రెస్‌పై తన దాడిని ముమ్మరం చేసారు. రాజ్యాంగం పేరిట ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చకు బదులుగా కాంగ్రెస్ పాలనలో విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి అతిపెద్ద ప్రత్యర్థి కాంగ్రెసే అని మండిపడ్డారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి గుర్తు చేస్తూ ప్రజలు అప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఓట్లు వేసారన్నారు. ‘‘రాజ్యాంగ రక్షణలో అంతకుమించిన ఎన్నిక లేనే లేదు. ఈ దేశపు నరనరాల్లో ప్రజాస్వామ్యం ప్రవహిస్తోందని 1977లో దేశం నిరూపించింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘2024 ఎన్నికలు రాజ్యాంగాన్ని సమర్ధించడానికి జరిగినవైతే, ఆ పనికి దేశప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు’’ అని మోదీ చెప్పారు.
ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.