ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టుగా అమరావతి నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు.
రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదన్న చంద్రబాబు, రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సూచించారని తెలిపారు. అమరావతి పేరును మంత్రివర్గంలో వందశాతం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామన్నారు. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తేవడంతో ఆ మహిమ అమరావతిలో ఉందన్నారు. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతి ప్రాంతాన్నిఎవరైనా రాజధానిగా ఒప్పుకోవాల్సిందేనన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం తనకు ఉందన్న చంద్రబాబు, కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చామన్నారు.29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వగా ప్రభుత్వ భూమితో కలిసి రాజధానికి 53,745 ఎకరాలు సమకూరిందన్నారు.
రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని దుయ్యబట్టారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో అమరావతిలో ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుందన్నారు.