ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారు.
సచివాలయంలో మంగళవారం నాడు మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు పలు విషయాలపై చర్చించారు. కొత్త ఇసుకవిధానం, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సిందేనన్నారు. ప్రజలు ఇబ్బందులు పరిష్కరించేందుకు తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలన్నారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలన్న చంద్రబాబు, అధికారులు వేగం పెంచాలన్నారు.