ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా ఐపీఎస్ అధికారి మహేశ్చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్డా 1998 బ్యాచ్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. దీంతో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల ఎస్పీగా సేవలందించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ లో దాదాపు ఐదళ్ళ పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వహించారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్గా, విశాఖ సీపీ నిఘా విభాగంలో ఐజీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. సీఆర్పీఎఫ్లో ఐజీగా నాలుగేళ్ళు పనిచేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు తిరిగొచ్చారు.
ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్హా పనిచేస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్హాతో పాటు, ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.