విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ముంబై కాలేజీ, ఇప్పుడు కొత్త డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తోంది. టోర్న్ జీన్స్, టీషర్ట్‌లు, శరీరం అసభ్యంగా కనిపించే దుస్తులు ధరించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎన్‌జి ఆచార్య అండ్ డికె మరాఠే కళాశాల విద్యార్ధులకు స్పష్టమైన డ్రెస్‌కోడ్ విధించింది. విద్యార్ధులు కళాశాల ఆవరణలో ఉన్నప్పుడు హుందాగా ఉండే ఫార్మల్ డ్రెస్‌లు మాత్రమే ధరించాలంటూ నోటీసులు జారీ చేసింది.
‘‘విద్యార్ధులు హాఫ్ హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, ప్యాంట్లు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ దుస్తులతో పాటు విదేశీ తరహా దుస్తులను కూడా ధరించవచ్చు. విద్యార్ధులు మతాన్ని సూచించే లేదా సాంస్కృతిక వివక్షను ప్రదర్శించే దుస్తులు ధరించకూడదు. జీన్స్, టీషర్ట్‌లు, ఒళ్ళు అసభ్యంగా కనిపించే దుస్తులు, జెర్సీలు ధరించకూడదు’’ అంటూ నోటీస్ జారీ చేసారు.
‘‘హిజాబ్, బురఖా, నకాబ్, స్టోల్, టోపీలు, బ్యాడ్జిలు వంటివి గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే తొలగించాలి. ఆ తర్వాతే విద్యార్ధులు క్యాంపస్‌లో తిరగవచ్చు’’ అని ఆ నోటీసులో వివరంగా చెప్పారు.
చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఆ కాలేజీలో కొన్నాళ్ళ క్రితమే కళాశాల ఆవరణలో హిజాబ్, నకాబ్, బురఖా, స్టోల్స్, టోపీలు, బ్యాడ్జిలు ధరించడంపై నిషేధం విధించారు. దాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది మంది విద్యార్ధినులు బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. కళాశాల విధించిన నిషేధం ‘నిరంకుశం, తర్కరహితం, నిర్హేతుకం, మూర్ఖత్వం’ అని వారు ఆరోపించారు. అయితే, కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది, విద్యార్ధినుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
కాలేజీ యాజమాన్యం తమ చర్య ముస్లిం మతానికి వ్యతిరేకం కాదని, కళాశాల ఆవరణలో క్రమశిక్షణ కోసమే యూనిఫాం డ్రెస్‌కోడ్ విధించామనీ వివరించింది. డ్రెస్‌కోడ్ అన్ని మతాలు, అన్ని కులాల వారికీ వర్తిస్తుందని కాలేజీ తరఫున వాదించిన న్యాయవాది చెప్పారు.