ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుల్రాయ్ గ్రామానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక ఆశ్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘నారాయణ సాకార్ హరి’ అనే పేరుతో సూరజ్‌పాల్ అనే వ్యక్తి నడుపుతున్న ఆశ్రమం చేరువలో ఈ దుర్ఘటన జరిగింది.
సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ సాకార్ హరి, రాంకుటీర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన్ని స్థానికులు భోలే బాబా అని పిలుస్తారు. ఆశ్రమం చేరువలోని ఖాళీ ప్రదేశంలో మంగళవారం సత్సంగం ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. సాయంత్రం సత్సంగం ముగిసే సమయంలో భోలే బాబా వెళ్ళిపోతుండగా ఆయన ఆశీర్వాదం కోసం పెద్దసంఖ్యలో భక్తులు ఎగబడ్డారు. అక్కడ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. విషయం తెలిసిన వెంటనే పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది అధికారులు ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు.
మరణించినవారిలో వందమందికి పైగా మహిళలు, ఏడుగురు చిన్నపిల్లలు ఉన్నారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 19మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ యూనిట్, డాగ్ స్క్వాడ్ చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్రీ, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి.
రాష్ట్రప్రభుత్వం ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల, గాయపడిన వారికి యాభైవేల రూపాయల పరిహారం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలిసే సమయానికి లోక్‌సభ ఇంకా జరుగుతండడంతో మోదీ సభలోనే దుర్ఘటన గురించి వెల్లడించారు.
భోలే బాబాకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు సత్సంగానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిపోయి అందరూ బయల్దేరే సమయంలో, బాబా ఆశీర్వాదం తీసుకోడానికి ఒకేసారి పెద్దసంఖ్యలో భక్తులు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసారు. ఆగ్రా అడిషనల్ డిజిపి, అలీగఢ్ పోలీస్ కమిషనర్ ఆ కమిటీకి నేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
హత్రాస్ సత్సంగం నిర్వాహకుల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం అక్కడ 80వేల మందికి అనుమతి ఇచ్చారు. అయితే సత్సంగానికి రెండున్నర లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు.
‘‘ఒకేసారి జనాలు అక్కడినుంచి వెళ్ళడానికి ప్రయత్నించడంతో నేల మీద కూర్చుని ఉన్న భక్తులను తొక్కేసారు. రహదారికి మరోవైపు పొలాలు ఉన్నాయి. అటునుంచి భక్తులు వెళ్ళకుండా నిర్వాహకులు నిలువరించారు. దాంతో ప్రజాసమూహం మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు, ఇతర అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు తమకు వీలున్న అన్ని చర్యలూ తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. అయితే కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఎలాంటి సహకారమూ అందలేదు’’ అని ఎఫ్ఐఆర్లో నమోదు చేసారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105, 126(2), 223, 238 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు.
ఆశ్రమ వ్యవస్థాపకుడు సూరజ్‌పాల్ ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లా బహాదుర్ నగరి గ్రామానికి చెందిన నన్నేలాల్, కటోరీ దేవి అనే రైతు కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గ్రామంలోనే సాగింది. యూపీ పోలీస్ శాఖలోని ఇంటలిజెన్స్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తితో 1999లోనే ఉద్యోగం వదిలిపెట్టేసాడు. తన పేరును నారాయణ సాకార్ హరిగా మార్చుకున్నాడు. అతని బోధనలకు ఆకర్షితులై లక్షల మంది అతని అనుయాయులుగా మారారు. ప్రతీ మంగళవారం నిర్వహించే సత్సంగానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.