బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడి ఇంగ్లాండ్‌లో తలదాచుకుంటోన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ ఓపెన్ ఎండెడ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ప్రత్యేక కోర్టు ఈ తీర్పు వెలువరించింది. విజయ్‌మాల్యా ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డాడని కోర్టు అభిప్రాయపడింది. విజయ్‌మాల్యా విదేశాల నుంచి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
పలు బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లు రుణాలు తీసుకుని, ఎగవేసిన విజయ్‌మాల్యా 2016 నుంచి ఇంగ్లాండ్‌లో విలాస జీవితం గడుపుతున్నాడు. విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతున్నా, ఇంగ్లాండ్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇరు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత విషయంలో సరైన ఒప్పందాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది.