మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పూణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉండటం మరింత ఆందోళనకరంగా మారింది.
పూణేలో మొదట ఓ వైద్యుడు , ఆయన కుమార్తెకు జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సదరు బాధితులు నివస్తున్న ప్రాంతంలోనే రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇరంద్ వాణే ప్రాంతంలో ఆరోగ్య శాఖ విస్తృతస్థాయిలో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపింది.
గర్భవతులకు జికా వైరస్ సోకితే పర్యావసానాలు ప్రమాదకరంగా ఉంటాయని శిశువుపై ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణం కంటే చాలా చిన్న తలతో శిశువులు జన్మించడం జరుగుతుందంటున్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ కేసును 1952లో మొట్టమొదటిసారిగా ఉగాండాలో గుర్తించారు.