అదానీ ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచర్స్‌లో పరోక్షంగా ట్రేడ్ చేయడానికి హిండెన్‌బర్గ్ సంస్థకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ సంస్థ కింగ్‌డన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, దాని అనుబంధ సంస్థలు సహకరించాయని, అదానీ షేర్లను షార్ట్‌సెల్ చేయడం ద్వారా వచ్చిన లాభాలను హిండెన్‌బర్గ్‌తో పంచుకున్నాయనీ… సెబి ఆరోపించింది.
సెబి దర్యాప్తులో… మార్క్ కింగ్‌డన్, అతని సంస్థలతో హిండెన్‌బర్గ్ సంస్థ చేతులు కలిపి, పథకం ప్రకారం షేర్లను షార్ట్ చేసిందని వెల్లడైంది. ఆ పథకం ఏంటంటే… ముందు ముసాయిదా నివేదికను రెండు సంస్థలూ పంచుకున్నాయి. తర్వాత కింగ్‌డన్ సంస్థ ఒక ట్రేడింగ్ అకౌంట్ ఏర్పాటు చేసింది. ఎఫ్‌పిఒ సమయంలో ముందస్తుగా అదానీకి వ్యతిరేకంగా నివేదికను ప్రచురించడం వల్ల లాభాలు తగ్గుతాయని తెలిసి కూడా దానికి అంగీకరించింది. భారతదేశపు సెక్యూరిటీస్ మార్కెట్‌తో తమకు సంబంధం లేదని చెప్పుకుంది. అదానీ షేర్ల ట్రేడింగ్ కోసం, షార్ట్‌సెల్లింగ్ ద్వారా కోల్పోయే లాభాల కోసం, ప్రత్యేకంగా ఇండియా ఫండ్ పేరిట నిధి ఏర్పాటు చేసింది.
హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ సంస్థపై తమ నివేదికను 2023 జనవరి 24న విడుదల చేసింది. అంతకంటె ముందే విదేశీ పెట్టుబడిదారు అయిన తమకు ముసాయిదా నివేదికను అందజేయడానికి హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని సెబి ఆరోపించింది.
హిండెన్‌బర్గ్ సంస్థ, దాని యజమాని నాథన్ ఆండర్సన్‌తో పాటు, నిబంధనలు ఉల్లంఘించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లలో ట్రేడింగ్ చేసిన మారిషస్ సంస్థల యజమాని మార్క్ కింగ్‌డన్‌కు సెబి షోకాజ్ నోటీసులు జారీచేసింది.
హిండెన్‌బర్గ్ సంస్థ, ఆండర్సన్, కింగ్‌డన్‌లు సెబి చట్టాలను, నియమనిబంధనలను, కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించారని సెబి ఆరోపించింది.
సెబి పరిశోధనలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి… కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన కె-ఇండియా ఆపర్చూనిటీస్ ఫండ్ (కెఐఒఎఫ్) ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ ఖాతా ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్క్రిప్‌లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. 2023 ఫిబ్రవరిలో ఆ స్క్రిప్‌లో పొజిషన్స్ స్క్వేర్ చేయడం ద్వారా 183 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆ ఫండ్ ఎన్ఎస్‌ఇలో కేవలం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రమే ట్రేడ్ చేసింది.
హిండెన్‌బర్గ్ తన స్పందనలో అదానీకి వ్యతిరేకంగా బెట్ చేయడానికి కింగ్‌డన్ ఉపయోగించిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను క్రియేట్ చేసింది, దాన్ని ఆపరేట్ చేసిందీ కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ అని ఆరోపించింది. సెబి తమ షోకాజ్ నోటీస్‌లో, 2023 జనవరి 5న కింగ్‌డన్ క్యాపిటల్, కెఎంఐఎల్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని, ఆ ఒప్పందం ప్రకారం అత్యవసరంగా ట్రేడింగ్ అకౌంట్ ఏర్పాటు చేసాయనీ తేల్చిచెప్పింది. ఆ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కింగ్‌డన్ క్యాపిటల్ సంస్థ అదానీ షేర్లను మాత్రం ట్రేడ్ చేసిందనీ, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత షార్ట్‌సెల్ చేయడం ద్వారా లాభాలు ఆర్జించిందనీ, ఆ లాభాలను హిండెన్‌బర్గ్‌తో పంచుకుందనీ వెల్లడించింది.
కింగ్‌డన్ క్యాపిటల్ సంస్థ హిండెన్‌బర్గ్‌తో లాభాలను 30శాతానికి బదులు 25శాతమే పంచుకోడానికి ఒప్పుకుంది. కెఐఒఎఫ్ ట్రేడింగ్ అకౌంట్‌ను ఏర్పాటు చేయడానికీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను షార్ట్‌సెల్ చేయడానికీ అయిన ఖర్చుల కోసమే ఆ లాభంలో వాటాను తగ్గించిందని సెబి స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కెఎంఐఎల్) ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హిండెన్‌బర్గ్ ఎప్పుడూ మా సంస్థ క్లయింట్ కాదు, మా కెఐఒఎఫ్ ఫండ్‌లో పెట్టుబడిదారు కూడా కాదు. మా పెట్టుబడిదారుల్లో ఎవరికీ హిండెన్‌బర్గ్ భాగస్వామి అన్న విషయం మాకు ఎప్పుడూ తెలియదు. మా ఫండ్‌లో పెట్టుబడులు ప్రత్యక్షంగానే తప్ప ఇతర వ్యక్తుల కోసం పెట్టిన పెట్టుబడులు ఏమీ లేవని ఫండ్ ఇన్వెస్టర్ నిర్ధారించారు కూడా’’ అని ఆ ప్రకటన ప్రకటించింది.