బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు బిష్ణోయ్ పన్నిన కుట్రలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ముంబైలో సల్మాన్ నివశించే అపార్టుమెంట్ గేటు వద్ద కాల్పుల ఘటన తరవాత పోలీసులు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ రూ.25 లక్షలు చెల్లించేందుకు గోల్డీబ్రార్ గ్యాంగుతో ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.
సల్మాన్ ఖాన్ హత్యకు వాడేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ తుర్కియేలో తయారైన జిగాన పిస్టళ్లను తెప్పించే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. తక్కువ ధరలో లభించే జిగాన పిస్టళ్లతో, బరస్ట్మోడ్లో అత్యంత వేగంగా కాల్పులు జరపవచ్చు. బిష్ణోయ్ సంపత్ నెహ్రా గ్యాంగ్‌లోని 70 మందితో కుట్ర అమలుకు స్కెచ్ వేసినట్లు విచారణలో తేలింది. గోల్డీబ్రార్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూసినట్లు పోలీసులు గుర్తించారు.
సింగర్ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో కూడా జిగాన పిస్టళ్లు ఉపయోగించారు. ఇక పాకిస్థాన్ నుంచి ఏకే 47, ఏకే 92ఎస్, ఎం 16 తుపాకులు తెప్పించేందుకు బిష్ణోయ్ ప్రయత్నం చేసినట్లు ఇప్పటికే అరెస్టైన నిందితుల ద్వారా తెలిసింది.