లోక్సభలో హిందుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన కాంగ్రెస్, నీతులు చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందరేశ్వరి విమర్శించారు. వేలాది మంది సిక్కులను హతమార్చి నీతులు చెప్పడం కాంగ్రెస్ కే చెల్లిందని తూర్పార బట్టారు. హిందుత్వంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల మంది హిందువుల మనోభావాలను రాహుల్ కించపరిచారని దుయ్యబట్టారు.
ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీ, హిందూవులను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఇప్పటికే మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు ఓడించినా తీరుమారలేదని చురకలు అంటించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ, హిందువులందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.