చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకప్పటి సహచరులు, ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేర్వేరు పార్టీల అధినేతలు. వారిద్దరూ భేటీ అయితే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో కలిసి మాట్లాడుకుందాం అంటూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అందుకే రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా నిలిచింది.
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్ళు గడిచిపోయింది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై పలుమార్లు చర్చలు జరిగినా ఇంకా అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమాలపై ఆ అంశాలు గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. అందువల్ల వచ్చే శనివారం జులై 6 మధ్యాహ్నం మీ ఇంట్లో కలుసుకుని మాట్లాడుకుందాం’’ అంటూ చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డికి లేఖ రాసారు.
‘‘ఆ సంక్లిష్టమైన అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోడానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ పరస్పరం లబ్ధి చేకూర్చగల పరిష్కారాల కోసం కలిసి సమర్ధంగా పనిచేయడానికీ, ముఖాముఖి సమావేశం మంచి అవకాశం కాగలదు. మన చర్చలు ఫలప్రదం అవుతాయనీ, మంచి ఫలితాలు వస్తాయనీ నాకు నమ్మకముంది’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విడదీసి పదేళ్ళు గడిచిపోయాయి. ఇన్నాళ్ళూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడా వ్యవధి ముగిసిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. 2014నాటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్మించే ప్రాజెక్టును మొదలుపెట్టినా, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం పక్కన పడేసింది.
వైసిపి, బి(టి)ఆర్ఎస్ ప్రభుత్వాలు స్నేహంగా ఉండేవి. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ అధికారం కోల్పోయాయి. ఏపీలో ఎన్‌డీయే కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాయి. వాస్తవానికి ఎన్‌డిఎ, కాంగ్రెస్ పరస్పర వ్యతిరేక పక్షాలు. కానీ రెండు ప్రభుత్వాల అధినేతల మధ్యా మంచి సామరస్యం ఉంది. అందువల్ల చంద్రబాబుకు మళ్ళీ తెలంగాణతో సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం కలిగింది. ఒకరకంగా ఇది తెలుగుదేశం పార్టీకి కూడా తెలంగాణలో మరోసారి కాలుమోపేందుకు అవకాశమే.
రేవంత్‌రెడ్డికి ఇది రాజకీయంగా కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కాంగ్రెస్‌లో సీఎం పీఠంపై కన్నువేసిన నేతలు ఎందరో ఉన్నారు. చంద్రబాబుతో రేవంత్ సాన్నిహిత్యం, వారిద్దరిపైనా ఉమ్మడిగా ఉన్న ఓటుకు నోటు కేసు వంటివి ఆ నాయకులకు అస్త్రాలే. అయితే అవన్నీ రేవంత్‌కు సైతం తెలియని విషయాలేమీ కావు. వాటిని ఎదుర్కోడం రేవంత్‌కు కష్టమేమీ కాదు.
పైగా, రేవంత్ అన్నిపార్టీలతోనూ సత్సంబంధాలు నెరపుతున్నారు. ఇటీవల వారం రోజుల ఢిల్లీ పర్యటనలో ఆయన జేపీ నడ్డా సహా పలువరు బీజేపీ నేతలను కలిసి వచ్చారు. అంతెందుకు, మార్చి నెలలో మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనను పెద్దన్నయ్య అని పిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘రెండు రాష్ట్రాల ప్రయోజనాల’ పేరిట చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో భేటీ అవదలచుకోవడం రాజకీయంగా ఆసక్తి కలిగించే పరిణామమే.