దేశ రాజధాని ఢిల్లీలో ఒక ముస్లిం యువతి (23) స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారింది. ఒక హిందూ యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న బెదిరింపులను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన జూన్ 25న చోటు చేసుకుంది.
హిందువుగా మారిన ముస్లిం యువతి నేతాజీ సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను మేజర్‌ననీ, తన ఇష్టపూర్తిగా, పరస్పర అంగీకారంతో గత ఏడాది పెళ్ళి చేసుకున్నామనీ చెప్పింది. ఆ మేరకు రుజువులుగా కోర్టు అఫిడవిట్లు, పెళ్ళి డాక్యుమెంట్లు, ఫొటోలూ ఇచ్చింది. తనను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. తమ జంటకు రక్షణ కావాలంటూ పోలీసులను అర్ధించింది.
యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు… హిందూమతంలోకి ఘర్‌వాపసీ అయి, ఒక హిందూ వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు ఆమె సోదరీమణులు మరియా, ఆయిషా, ఇంకా ఆమె మేనమామ బెదిరిస్తున్నారు. ఆమె పెళ్ళిని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె భర్తను తప్పుడు రేప్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం సహించలేకనే ఆమె భర్తను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆ యువతి ఆరోపణ.
గతేడాది పెళ్ళి అయినప్పటినుంచీ ఆ యువతిపై ఆమె బంధువులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తన భర్తను వదిలేయమనీ, మళ్లీ పుట్టింటికి వచ్చేయమనీ, హిందూధర్మాన్ని వదిలి ఇస్లాంలోకి రమ్మనీ ఒత్తిడి చేస్తున్నారు. జూన్ 24న ఆమె అక్కలు బలవంతంగా ఆమె ఇంట్లోకి చొచ్చుకొచ్చారు. తన భర్తను వదిలేసి రమ్మని బలవంతం చేసారు.
యువతి తండ్రి ఆమె మూడేళ్ళ వయసులోనే చనిపోయాడు. తల్లి ఒక్కర్తే పిల్లలను పెంచింది. యువతికి తన స్నేహితుల ద్వారా హిందూ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఆమెకు హిందూ సంస్కృతి పరిచయమైంది. ఆ సంస్కృతి ఆమెకు నచ్చింది. వారిద్దరూ రెండేళ్ళు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గతేడాది పెళ్ళి చేసుకున్నారు.
పెళ్ళి చేసుకున్నా, యువతి వెంటనే తన భర్త వద్దకు వెళ్ళిపోలేదు. తన పెళ్ళిని కుటుంబ సభ్యులు ఎప్పటికైనా ఆమోదిస్తారని ఎదురుచూసింది. అయితే వారు ఆ పెళ్ళిని ఒప్పుకోలేదు, పైగా వారిని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ యువకుడు ఆ యువతిని కిడ్నాప్ చేసాడని ఆరోపణలు చేసారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలు నిరాధారాలని రుజువు చేసారు.