రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ప్రస్తావించారు. హిందువులను హింసాత్మక ప్రవృత్తి కలిగినవాళ్ళుగా ముద్రవేయడంపై అధికార బీజేపీ మండిపడింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ గుర్తు అభయముద్ర అనీ, అది ముస్లిముల నమాజుల్లో కనిపిస్తుందనీ అనడాన్ని ముస్లిం వర్గాలు తప్పుపట్టాయి.
కాంగ్రెస్ పార్టీ చిహ్నం అయిన చేతి గుర్తును రాహుల్ గాంధీ, హిందూ దేవీదేవతలు చూపించే అభయముద్రతో పోల్చారు. అంతటితో ఆగకుండా అలాంటి అభయముద్ర అన్ని మతాల్లోనూ ఉంటుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘‘భయపడవద్దు అని ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో నమాజు చేసేటప్పుడు రెండు చేతుల్లోనూ అభయముద్ర కనిపిస్తుంది’’ అని రాహుల్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ముస్లిములు ఖండిస్తున్నారు. నిజానికి ఇస్లాం విగ్రహారాధనకు, ప్రతీకలకూ వ్యతిరేకమని గుర్తుచేస్తున్నారు.
ఆల్ ఇండియా సూఫీ సజ్జాదానషీన్ కౌన్సిల్ ఛైర్మన్ సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘పార్లమెంటులో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ అభయముద్ర ఇస్లాంలో కూడా ఉందని చెప్పారు. ఇస్లాంలో విగ్రహారాధన ప్రస్తావనే లేదు. ఇంక ఎలాంటి ముద్రల సంగతీ లేనేలేదు. ఆయన మాటలను నేను తిరస్కరిస్తున్నాను. ఇస్లాంలో అభయముద్ర గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలి’’ అని నసీరుద్దీన్ స్పష్టంగా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చిహ్నమైన చేతి గుర్తును అన్ని మతాలతోనూ కలపాలని రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. నెలల తరబడి ఎన్నికల ప్రచారంలో సమాజాన్ని వివిధ వర్గాలుగా విడదీసే ప్రయత్నాలు చేసిన రాహుల్ ఇప్పుడు మతాల మధ్య లేని ఐకమత్యాన్ని పులమాలని బలవంతంగా ప్రయత్నిస్తున్నారు. కులఆధారిత జనగణన, ధనికుల సంపదను దేశజనాభాకు పంచిపెడతానన్న వాగ్దానం లాంటి గిమ్మిక్కులతో సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేసిన రాహుల్ ఇప్పుడిలా కృత్రిమ ఐకమత్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
హిందూసమాజం పట్ల రాహుల్ గాంధీకున్న ద్వేషభావం పార్లమెంటు ప్రసంగంలో స్పష్టంగా తెలిసింది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు తీవ్ర స్పందన వచ్చింది. ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా కలగజేసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా… రాహుల్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో జోక్యం చేసుకున్నారు. ‘తమను తాము హిందువులుగా చెప్పుకునేవారే ఎప్పుడూ హింసకు పాల్పడతారు’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను వారిద్దరూ తీవ్రంగా ఖండించారు.
‘మన మహాపురుషులు అందరూ అహింస గురించి, భయాన్ని తొలగించడం గురించీ చెప్పారు. కానీ తమను తాము హిందువులుగా చెప్పుకునేవారు మాత్రమే హింస, ద్వేషం, అసత్యాల గురించి మాట్లాడతారు’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ‘‘హిందూ సమాజం మొత్తాన్నీ హింసాత్మకమైనది అనడం చాలా తీవ్రమైన విషయం’’ అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసారు.
‘‘తమను హిందువులుగా ప్రకటించుకునే వారే హింసాకాండకు పాల్పడతారు అని ప్రతిపక్ష నాయకుడు స్పష్టంగా ప్రకటించారు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, లక్షలాది మంది తమను తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారు. ఏ మతంతోనైనా హింసను ముడిపెట్టడం తప్పే. ఆయన క్షమాపణ చెప్పి తీరాలి’’ అని అమిత్ షా డిమాండ్ చేసారు.