ఒడిషా హైకోర్టు వింత తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు ఆసిఫ్ అలీకి విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మార్చింది. అతను దేవుడి ముందు లొంగిపోయాడని, ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఒడిషా హైకోర్టు అతని మరణ శిక్షను జీవితఖైదుకు తగ్గించడం సంచలనంగా మారింది.
బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు తీర్పు వెలువరించగా, రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఒడిషాలోని జగత్సింగ్పుర్లోని పోక్సో కోర్టు ఆసిఫ్ అలీకి మరణ శిక్ష విధించింది. పోక్సో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆసిఫ్ అలీ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం జూన్ 27న 106 పేజీల తీర్పును వెలువరించింది. ప్రతి రోజూ నిందితుడు అల్లాను ప్రార్థిస్తున్నాడని, నేరం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ అతని మరణ శిక్షను, జీవితఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది.