మహారాష్ట్రలోని పుణేలో ఒక హిందూ దళిత యువకుడిపై ముస్లిములు మూకుమ్మడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాతంగ కులానికి చెందిన 19ఏళ్ళ యువకుడిపై ముగ్గురు ముస్లిం యువకులు, ఒక హిందూ యువకుడు కత్తితో దాడి చేసారు. అతన్ని కులం పేరుతో దూషించారు. ఆ సంఘటన జూన్ 27న జరిగింది.
పుణే సిటీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఎజాజ్ షేక్, అఫ్రిదీ షేక్, సాదిక్ షేక్, ఉమేష్ భండారీ అనే నలుగురు యువకులపై కేసు నమోదు చేసారు. 26వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.10 గంటల సమయంలో ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు.
ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం… బాధితుడు పుణేలోని లోహియానగర్ ప్రాంతానికి చెందినవాడు. బంధువుల ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వెడుతుండగా, దారిలో నిందితులు ఎదురయ్యారు. వారు గంగధా ప్రాంతంలో బాధితుడిపై దాడి చేసారు. బాధితుడు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను ఆటోతో గుద్దేసారు.
అఫ్రిదీ అనే వ్యక్తిపై బాధితుడి సోదరుడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తమపై తప్పుడు ఫిర్యాదు చేసాడని ఆరోపిస్తూ నిందితుడు, సహనిందితులు బాధితుణ్ణి కులం పేరుతో తీవ్రంగా దూషించారు. అఫ్రిదీ తన బండిలో దాచి ఉంచిన కత్తి బైటకు తీసి, దానితో బాధితుడిపై దాడి చేసాడు. బాధితుడు అక్కడినుంచి పారిపోయి ప్రాణాలు రక్షించుకోడానికి ప్రయత్నించాడు. అయినా నిందితులు అతన్ని వదలకుండా అనుసరించారు. అఫ్రిదీ మరోసారి బాధితుడి తలపై కత్తితో కొట్టాడు. ఆ క్రమంలో బాధితుడికి చిన్నగాయాలయ్యాయి.
సహనిందితులు బాధితుడి మీదకు గాజుసీసాలు విసిరారు. వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితుడు ఆ ప్రాంతంలోని తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ కలిసి బిబ్వేవాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసారు.
బాధితుడికి తీవ్రగాయాలు అవడంతో అతన్ని ససూన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. బాధితుడిపై ఎందుకు దాడి చేసారన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
పుణే లోహియానగర్‌లోనే కొద్దిరోజుల క్రితం ఇటువంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. జూన్ 24న ఖడక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్షయ్ అనే హిందూ దళిత యువకుడిపై 9మంది ముస్లిం యువకులు దాడి చేసారు. అక్షయ్ బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నందున అతన్ని లక్ష్యం చేసుకుని దాడి చేసారు. ఆ సంఘటనలో అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దళిత యాక్టివిస్టు అయిన అక్షయ్, స్థానికంగా ముస్లిముల ఆగడాల గురించి బహిరంగంగా విమర్శలు చేస్తుండేవాడు. దాంతో అతమీద దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటనలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది.