ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముస్కాన్ సైఫీ అనే ముస్లిం యువతి హిందూధర్మంలోకి మతం మారింది. రాజేష్ కుమార్ అనే హిందూ యువకుణ్ణి వైదిక పద్ధతిలో పెళ్ళి చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది.
ముస్కాన్ సైఫీ (19) ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన యువతి. ఆమె తండ్రి మొదట్లో హిందువే, కానీ ఒక ముస్లిం మహిళను పెళ్ళి చేసుకున్నాక ఆ మతంలోకి మారాడు. ముస్కాన్‌కు కొంతకాలం క్రితం సోషల్ మీడియా ద్వారా రాజేష్ కుమార్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రాజేష్ ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా ఇజ్జత్‌నగర్‌కు చెందినవాడు.
ముస్కాన్, రాజేష్‌ల పరిచయం తొలుత స్నేహంగానూ, తర్వాత ప్రేమగానూ పరిణమించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించారు. కానీ ఇద్దరి కుటుంబాలూ పెళ్ళికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా ముస్కాన్ తన కుటుంబం నుంచి ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొంది. రాజేష్ మాత్రం తమ ప్రేమ గురించి ఆశలు వదులుకోలేదు. ముస్కాన్‌ను పెళ్ళి చేసుకోడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ క్రమంలోనే అతను అగస్త్యముని ఆశ్రమం గురించి తెలుసుకున్నాడు.
నిన్న ఆదివారం నాడు రాజేష్, ముస్కాన్ కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. తమ పెళ్ళి జరిపించమని అక్కడి పండితుడు కెకె శంఖధర్ను కోరారు. ఆయన మొదట వారిద్దరి పత్రాలనూ పరిశీలించారు. రాజేష్‌ను తన ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకుంటున్నానంటూ ముస్కాన్ ఇచ్చిన అఫిడవిట్‌ను కూడా తనిఖీ చేసారు. ఆ తర్వాత వారిద్దరికీ హిందూ వివాహ పద్ధతి ప్రకారం పెళ్ళి జరిపించారు. తర్వాత శంఖధర్, మరికొందరు హిందూసంస్థల ప్రతినిధులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళి తర్వాత ముస్కాన్ తన పేరును ఖుషీగా మార్చుకుంది.
ముస్కాన్ తనకు చిన్నతనం నుంచీ హిందూధర్మం పట్ల విశ్వాసం ఉందని చెప్పుకొచ్చింది. తన కుటుంబం కూడా మొదట హిందువులేనని, ఎన్నో దాడుల తర్వాత వారు ముస్లిములుగా మతం మారాల్సి వచ్చిందన్న సంగతి తనకు తెలుసని ఆమె రాతపూర్వకంగా వెల్లడించింది. ఇస్లామ్ మతంలో మహిళలకు గౌరవం లేదని ఆమె వివరించింది. ట్రిపుల్ తలాక్, హలాలా వంటి పద్ధతులంటే తనకు భయమని కూడా వెల్లడించింది.
రాజేష్ కుటుంబం మొదట ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయినా, తర్వాత మనసు మార్చుకున్నారు. అందుకే ఖుషీగా మారిన ముస్కాన్ తన అత్తవారింటికి ఆనందంగా వెళ్ళింది.