హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో లోక్సభ ఇవాళ అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని హోంమంత్రి అమిత్ షా పట్టు పట్టారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకమని ముద్ర వేయడం తీవ్రమైన విషయమంటూ, ప్రధానమంత్రి మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై సభలో ఇవాళ చర్చ జరుగుతోంది. ఆ సందర్భంగా, మొదటిసారి ప్రతిపక్ష నేతగా నిలిచిన రాహుల్ గాంధీ, బీజేపీ నేతృత్వంలోని ఎనడిఎ ప్రభుత్వమే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. ‘ఇండియా’ అన్న ఆలోచన మీద వ్యవస్థీకృత దాడికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
‘‘ఇండియా అన్న ఆలోచన మీద పూర్తిస్థాయిలో వ్యవస్థీకృతమైన దాడి జరుగుతోంది. రాజ్యాంగం మీద, దానిపై దాడి చేసేవారిని అడ్డుకునేవారి మీదా దాడి జరుగుతోంది. మాలో చాలామంది మీద దాడులు జరిగాయి. కొంతమంది నాయకులు ఇంకా జైల్లోనే ఉన్నారు. అధికారం, సంపద ఒకచోట పోగుపడడాన్నీ; పేదలు, దళితులు, మైనారిటీలను అణగదొక్కేస్తుండడాన్నీ; వ్యతిరేకించిన వారిని, అడ్డుకోడానికి ప్రయత్నించిన వారిని తొక్కేస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు నామీద దాడి జరిగింది. అందులో నేను బాగా ఆనందించిన ఘట్టం ఈడీ నన్ను 55 గంటల పాటు విచారించిన సందర్భం’’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసారు.
‘‘కాంగ్రెస్ గుర్తు అభయముద్ర. అది భయం లేకపోవడానికి, అభయానికి, రక్షణకూ చిహ్నం. అది భయాలను పారద్రోలుతుంది. హిందూమతం, ఇస్లాం, సిక్కిజం, బుద్ధిజం, ఇతర భారతీయ మతాలన్నింటిలోనూ అభయహస్తం దైవ రక్షణకు చిహ్నం. మన మహాపురుషులందరూ అహింస గురించి, భయాన్ని ఎదుర్కోవడం గురించీ చెప్పారు. కానీ, తమను హిందువులుగా పిలుచుకుంటున్నవారు కేవలం హింస, ద్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారు. మీరసలు హిందువులే కారు’’ అంటూ రాహుల్ గాంధీ అధికార పక్షాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. హింసను ఒక మతానికి ముడివేసి మాట్లాడడం తప్పంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘‘తమను హిందువులుగా చెప్పుకునేవారు హింస గురించి మాట్లాడతారు, హింసకు పాల్పడతారు అంటూ ప్రతిపక్ష నేత విస్పష్టంగా చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారన్న సంగతి ఆయనకు తెలియదు. హింసను ఏ మతంతోనైనా ముడిపెట్టడం తప్పు, ఆయన క్షమాపణ చెప్పితీరాలి’’ అన్నారు అమిత్ షా.
దానికి రాహుల్ గాంధీ మళ్ళీ ఎదురువ్యాఖ్యలు చేసారు. బీజేపీ ఒక్కటే మొత్తం హిందూసమాజం కాదన్నారు. ‘‘నరేంద్ర మోదీ మొత్తం హిందూ సమాజం కాదు. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదు. హిందూ సమాజాన్ని బీజేపీ ఏం గుత్తకు తీసుకోలేదు’’ అన్నారు రాహుల్ గాంధీ.
మోదీ సమక్షంలో తనను పలకరించడానికి కూడా మంత్రులు భయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ప్రసంగిస్తున్న సమయంలో మోదీ రెండుసార్లు లేచి తన అభ్యంతరాలు వ్యక్తం చేసారు.
‘‘మొత్తం హిందూ సమాజంపై హింసాత్మకం అని ముద్ర వేయడం తీవ్రమైన సంగతి’’ అంటూ మోదీ మొదటిసారి తన అభ్యంతరం వ్యక్తం చేసారు. మరో సందర్భంలో ‘‘ప్రతిపక్ష నేతను సీరియస్గా తీసుకోవాలన్న విషయాన్ని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’’ అని మోదీ చెప్పారు.